KCR- Heavy Rains: ఒకవైపు దేశం కాలిపోతుంటే.. హిట్లర్ పిడేలు వాయిస్తూ కూర్చున్నాడట.. తాజాగా.. దేశం ఆకలితో అలమటిస్తుంటే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నారు.. వీరికి ఏమాత్రం తీసిపోరు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఓవైపు తెలంగాణను వరదలు ముంచెత్తుతున్నా.. ప్రజలు వరదల్లో కొట్టుమిట్టాడుతున్నా.. 19 మంది వరదల్లో కొట్టుకుపోయి మరణించినా.. నగరాలు, పట్టణాలు, గ్రామాలు నీటిలో మునిగినా.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ వీడడం లేదు. తన వర్కింగ్ స్టైల్ ను మార్చుకోలేదు. ఆయన సమీక్షలు చేస్తున్నారని.. అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారని మీడియాకు ప్రకటనలు ఇవ్వడమే కానీ నిజమేంటో ఎవరికీ తెలియదు.
వాతావరణ శాఖ హెచ్చరించినా..
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, వరదలు వస్తాయని ఓవైపు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. ముంపు గ్రామాల ప్రజల్ని తరలించే ప్రయత్నం చేయలేదు. దీంతో వర్షాలు, వరదలకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. చివరకు కేంద్ర సహాయ బృందాలు, ఎన్డీఆర్‌ఎప్, ఆర్మీ హెలికాఫ్టర్లు వస్తే తప్ప.. కొంత మందిని కాపాడలేకపోయారు. అధికార యంత్రాగం అంతా నిస్సహాయమైపోయిందన్న విమర్శలు విపక్షాల నుంచే కాదు బాధితుల నుంచి వస్తున్నాయి.
అన్నిశాఖలపై సమీక్ష చేస్తే ముఖ్యమైన మంత్రి..
ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్న కేటీఆర్ వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గురించి అడిగితే తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తన శాఖ గురించి అడగాలని సలహా ఇచ్చారు. కానీ కేటీఆర్ అన్ని శాఖల పనులు ప్రకటనలు చేస్తున్న విషయాన్ని మర్చిపోయారు. వరంగల్ అతలాకుతలం అయినా కేసీఆర్, కేటీఆర్ అక్కడకు వెళ్లి బాధితులకు భరోసా ఇద్దామన్న ఆలోచన చేయలేదు. దీంతో సహజంగానే విపక్ష నేతలు కేసీఆర్ మిస్సింగ్ అంటూ ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
కేసీఆర్ వ్యూహం వేరే..
అయితే ఇలాంటి రాజకీయాల్ని ఎలా ఎదుర్కోవాలో కేసీఆర్‌కు తెలుసు. అందుకే కేబినెట్ భేటీ పెడుతున్నామని.. ఆర్థిక సాయం అందిస్తామన్న లీక్ ఇచ్చారు. మూడో తేదీ నుంచి అసెంబ్లీ సమవేశాలు పెడుతున్నారు. ఈ సమయంలో బాధితుల్ని ఆదుకోకుండా రాజకీయాలేమిటి అన్న విమర్శలు రాకుండా వారి కోసమే అన్నట్లుగా వీటిని పెడుతున్నారు. మొత్తంగా కేసీఆర్ వర్కింగ్ స్టైల్ అంతేనని.. ప్రజలే తెలుసుకోవాలని ఇతర పార్టీల నేతలు నిట్టూరుస్తున్నారు.