
KCR : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. దళిత బంధు, గొర్రెల పంపిణీ, సొంత ఇంటి నిర్మాణం, డబుల్ బెడ్ రూం వంటి వాటిపై చర్చించింది. పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కావాల్సిన పరిస్థితులపై ఆరా తీసింది. కేబినెట్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు కేటాయించడంపై ఆమోదం తెలిపింది. 58,59 జీవోల కింద మరోసారి దరఖాస్తు చేసుకునే అంశంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించింది. ఈ మేరకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు తక్షణమే అమలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో ఇక సంక్షేమ పథకాల అమలు వేగంగా ముందుకు సాగనుందని చెబుతున్నారు. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ప్రభుత్వం ఇక మీదట వేగవంతమైన పనులు చేసేందుకు సంకల్పిస్తోంది.
వచ్చే నెల 14న అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపాలను ప్రారంభించాలని నిర్ణయించింది. సచివాలయం కూడా అదే రోజు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. గొర్రెల పంపిణీ రెండో విడత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించింది. ఇప్పటికి తీసుకోని వారిని ఎంపిక చేసి వారికి కూడా గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని భావించింది. పశుసంపదను అభివృద్ధి చేసే క్రమంలో గొర్రెలను పంపిణీ చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మొదటి విడత పంపిణీ చేసిన ప్రభుత్వం రెండో విడత కూడా పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తోంది. ఇందుకు గాను రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఇది మూడు విడతల్లో అందించనుంది. ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున 4 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. దీనికి గాను గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించిన అప్పులు కూడా రద్దు చేయనుంది. దీంతో ఇళ్లు లేని చాలా మందికి ప్రయోజనం చేకూరనుంది. పేద వారికి మేలు చేసే ఈ పథకంతో సొంతింటి కల నెరవేరనుంది.
4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మేరకు పోడు భూములు కలిగిన వారికి పట్టాలు మంజూరు చేసి వారి చిరకాల వాంఛ తీర్చేందుకు సిద్ధమైంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్లో పోడు భూముల విషయం ప్రత్యేకంగా చేర్చారు. గొర్రెల పంపిణీకి రూ. 4,463 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో గొర్రెల పంపిణీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాలని సూచించింది. గతంలో రాని వారికి తక్షణమే యూనిట్లు అందజేయాలని నిర్ణయం తీసుకుంది.
దళితబంధు కూడా సమర్థంగా అమలు చేసేందుకు ఆమోదించింది. రాష్ర్టంలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే హుజురాబాద్ లో మొత్తం వందశాతం అమలు చేసింది. అలాగే రాష్ట్రంలో అందరికి దళితబంధు అమలు చేస్తామన్నారు. ఈ మేరకు 118 నియోజకవర్గాల్లో 1100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దళితబంధును విజయవంతంగా అమలు చేసి వారి కోరిక తీరుస్తామని పేర్కొంది. దీనికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
కాశీ, శబరిమలల్లో వసతి గృహాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కాశీ, శబరిమల యాత్రలకు వెళ్లే తెలంగాణ భక్తులకు అక్కడ వసతి సముదాయాలు నిర్మించేందుకు ముందుకొచ్చింది. కాశీలో రూ.25 కోట్లు, శబరిమలలో రూ. 25 కోట్లతో వసతి సముదాయాలు నిర్మించనుంది. ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ పథకాలు శరవేగంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.