
– ఆసీస్ ఇన్నింగ్స్ కు వెన్నుముక గా నిలిచిన కవాజ
– చేతులు ఎత్తేసిన భారత్ స్పిన్ త్రయం
– పిచ్ నుంచి బౌలర్లకు లభించని సహకారం
IND vs AUS : భారత స్పిన్ త్రయం తేలిపోయింది.. పేస్ అటాక్ ఆసీస్ బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు.. వెరసి అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరిది అయిన నాలుగో టెస్టు మొదటి రోజు ఆసీస్ పై చేయి సాధించి భారత్ షాక్ ఇచ్చింది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టు మొదటి రోజు మ్యాచ్ లో భారత్ పూర్తిగా తేలిపోయింది. మొదటి రెండు టెస్టుల్లో పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన భారత్.. మూడో టెస్టులో చేతులు ఎత్తేసింది. ఆ టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించడంతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరాలంటే నాలుగో టెస్టులో గెలవాల్సిన పరిస్థితుల్లో మొదటి రోజు బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ ఆసేస్ కు అడ్డుకట్ట వేయలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆది నుంచి దూకుడుగానే ఆడింది. మొదటి రోజు ప్రారంభమైన గంటన్నర పాటు పూర్తిగా ఆస్ట్రేలియా బ్యాటర్ల హవా నడిచింది. ఓపెనర్లు ట్రివిస్ హెడ్, ఉస్మాన్ కవాజ ఈ సిరీస్ లోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని (61) జట్టుకు అందించారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపించింది. అప్పటికే మంచి ఊపు మీద ఉన్న ట్రివిస్ హెడ్ భారీ షాట్లతో చెలరేగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో జడేజాకు చిక్కి అవుట్ అయ్యాడు. దీంతో తొలి వికెట్ తీసుకొని భారత్ ఊపిరి పీల్చుకుంది.
కవాజ వన్ మాన్ షో..
నాలుగో టెస్ట్ మొదటి రోజు మ్యాచ్లో భారత్ తేలిపోవడానికి ముఖ్య కారణం ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ కవాజ అని చెప్పాలి. ఓపెనర్ గా వచ్చిన కవాజ మొదటి రోజు పూర్తయ్యేంతవరకు నాట్ అవుట్ గా నిలిచి 251 బంతుల్లో 104 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ ఆడే క్రమంలో బలమైన భాగస్వామ్యాలను నెలకొల్పడం ఆస్ట్రేలియా కు కలిసి వచ్చింది. ఓపెనర్ ట్రివిస్ హెడ్ తో కలిసి 61 పరుగులు భాగస్వామ్యం, రెండో స్థానంలో వచ్చిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్ తో కలిసి 79 పరుగుల విలువైన మూడో వికెట్ భాస్వామ్యాన్ని నెలకొల్పాడు. స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్స్ కాంబ్ కొద్ది పరుగుల వ్యవధిలో అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెమెరాన్ గ్రీన్ తో కలిసి మరో విలువైన భాగస్వామ్యాన్ని కవాజ నెలకొల్పాడు. ఐదో వికెట్ కు కవాజ-గ్రీన్ కలిసి 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మొదటి రోజు ఆస్ట్రేలియాకు పై చేయి సాధించిపెట్టారు. ఈ భాగస్వామ్యంలో గ్రీన్ 64 బంతుల్లోనే 49 పరుగులు సాధించడం గమనార్హం.
తేలిపోయిన బౌలర్లు..
మొదటి రోజు టెస్టులో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. షమీ కొంత పరవాలేదనిపించి రెండు వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. ఉమేష్ యాదవ్ 15 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 58 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ తీయలేకపోవడం, అలాగే ఈ మ్యాచ్లో భారత్ పూర్తిగా ఆశలు పెట్టుకున్న స్పిన్ త్రయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర పటేల్ అనుకున్నంత స్థాయిలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టలేకపోవడం భారత్ మొదటి రోజు ఆటలో వెనుకబాటుకు కారణం అయింది. ఈ స్పిన్ త్రయాన్ని ఆస్ట్రేలియా బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కోవడంతో మొదటి రోజు ఆస్ట్రేలియా పై చేయి సాధించడానికి అవకాశం ఏర్పడింది.
పిచ్ నుంచి సహకారం కరువు..
చివరి టెస్టులో ఎలాగైనా విజయం సాధించి టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలని భావించిన భారత్ అందుకు అనుగుణంగానే సన్నద్ధమైంది. ముఖ్యంగా అహ్మదాబాద్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఏకంగా ముగ్గురు స్పిన్నర్లను భారత్ బరిలోకి దించింది. పిచ్ నుంచి ఆశించిన స్థాయిలో బౌలర్లకు సహకారం లభించకపోవడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లపై భారత బౌలింగ్ విభాగం ఒత్తిడి పెంచలేకపోయింది. అయితే రెండో రోజు నుంచి పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉందని క్యూరేటర్ చెబుతుండడంతో భారత్ రెండో రోజు ఆటలో పట్టు బిగించాలని భావిస్తోంది. ఏది ఏమైనా మొదటి రోజు ఆసీస్ పై చేయి సాధించడంతో ఈ టెస్ట్ ఫలితం ఐదో రోజు వరకు తేలకపోవచ్చు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.