Bandi Sanjay: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూసుకుపోతున్నారు. అధికార టీఆర్ఎస్ తో హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఇక్కడ మంత్రులు, నేతలను మోహరించగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర నేతలు హుజూరాబాద్ లో మకాం వేసి ప్రత్యర్థులపై కత్తలు దూస్తున్నారు.ప్రత్యర్థులను ఇరుకునపెట్టేలా మాటల తూటాలు బండి సంజయ్ పేలుస్తున్నారు.తాజాగా బండి సంజయ్ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.

బీజేపీ లేఖలతోనే ఈసీ దళితబంధు నిలిపివేసిందని అధికార టీఆర్ఎస్ ఆరోపిస్తోంటే.. దళితబంధు ఆపేస్తారని తెలిసే ప్రభుత్వం కుట్రపూరితంగా పథకాన్ని తెచ్చిందని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది.
దళితబంధు నిలిపివేయాలని బీజేపీ లేఖ రాసిందని అధికార టీఆర్ఎస్ చేసిన విమర్శలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. బీజేపీ లేఖ రాసిందని టీఆర్ఎస్ అబద్ధాలు ఆడుతోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ వాళ్లే లేఖలు రాసి పథకాలు నిలిపివేయించి నెపం బీజేపీపై నెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు పథకాలు ప్రకటించి ఈసీ నిలిపివేసిందని చెప్పడం టీఆర్ఎస్ కు అలవాటేనన్నారు. నాగార్జునసాగర్ లోనూ ఇలానే గొర్రెల పంపిణీ పథకం కూడా ఆగిపోయిందని గుర్తు చేశారు.
దళితబంధు పథకం నిలిపివేయాలని బీజేపీ లేఖ రాసినట్లు నిరూపిస్తారా? అని బండి సంజయ్ సవాల్ చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ప్రమాణానికి సిద్ధమా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మంత్రి హరీశ్ రావు అబద్దాలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
హరీష్ రావు మంచోడేనని.. కాకపోతే మీడియా ముందు మాత్రం అబద్దాలు మాట్లాడుతారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ హరీష్ రావేనని సంజయ్ అన్నారు. అబద్దాలు మాట్లాడవద్దని హరీష్ కు సూచించారు.
కేసీఆర్ కుటుంబంలో నాలుగు కమిటీలున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. లంచం ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసే కమిటీ..మీడియా ముందు అబద్దాలు చెప్పే కమిటీ అంటూ ఎద్దేవా చేశారు.