KCR: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం(ఫిబ్రవరి 8న) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. పదేళ్లు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్షం వైపు సీట్లో కూర్చోనున్నారు. మొన్నటి వరకు ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇష్టపడని గులాబీ బాస్.. కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు సభకు రావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
వేడెక్కనున్న సమవేశాలు..
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అసెంబ్లీ సమావేశం అవుతోంది. తొలిసారి కాంగ్రెస్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అయితే గత సమావేశాలకు తుంటి ఎముక గాయం కారణంగా కేసీఆర్ రాలేదు. తాజాగా ఆయన కోలుకున్నారు. అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి సమవేశాలు వేడెక్కడం ఖాయమన్న చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది. ప్రధానంగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం, ఎన్నికల హామీలు అమలులో జాప్యంపై కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్‌ను ఇరుకున పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాజుకున్న నిప్పు..
ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం రేగుతోంది. రాష్ట్రాన్ని అప్పులపాటు చేసిన తీరును, ప్రాజెక్టుల్లో అవినీతిని కాంగ్రెస్ ఎండగడుతోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భారీ అవినీతి, ఇంజినీరింగ్ అవకతవకలను బయటపెట్టేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై సర్కార్‌ను ఇరుకున పెట్టాలనుకుంటోంది.
గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం..
ఇక బడ్జెట్ సమావేశాలు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంయుక్త ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఆమోదం పొందనుంది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు శనివారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీని తర్వాత బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతుంది.