KCR : ప్రగతి భవన్ లో ఎర్ర తివాచీపరిస్తే అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలోకి వెళ్లిపోయాడు. ఎన్నికల్లో ఆర్థిక సహాయం చేస్తే కుమారస్వామి సైలెంట్ అయిపోయాడు. ప్రత్యేక విమానం తీసుకొని తమిళనాడు వెళితే స్టాలిన్ హ్యాండ్ ఇచ్చాడు. మంది మార్బలాన్ని తీసుకొని బీహార్ వెళితే నితీష్ కుమార్ ముఖం చాటేసాడు. భగవంతు సింగ్ మాన్ ను ఖమ్మం ఆహ్వానిస్తే పక్కకు తప్పుకున్నాడు. ఆసరాగా ఉంటాడు అని ఆతిధ్యం ఇస్తే అరవింద్ కేజ్రీవాల్ తన దారి తను చూసుకున్నాడు. కలిసి రావాలని కోరితే పినరయి విజయన్ పక్కకు వెళ్ళాడు. ఢిల్లీలో ధర్నా చేస్తే రాకేష్ టికాయత్ పత్తా లేడు. అంటే ఎటు చూసుకున్నా కలిసి వచ్చేవారు లేరు. పైసలు ఖర్చు పెట్టుకున్నా కనికరించేవారు లేరు. గుణాత్మక మార్పు అందిస్తానని నెత్తినోరూ కొట్టుకున్నా.. మా సార్ గొప్పోడని నమస్తే తెలంగాణ పేజీలకు పేజీలు ప్రచురించినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? గత ఐదు రోజుల నుంచి ప్రగతి భవన్ దరిదాపులకు కూడా వెళ్ళని ఆయన ఎటువంటి అడుగులు వేస్తున్నారు?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభమైన నాటి నుంచి కెసిఆర్ ఫామ్ హౌస్ వైపు వెళ్లలేదు. మంత్రులతో, కీలక అధికారులతో వరుస భేటీలు నిర్వహించారు. కీలక సమావేశాలు జరిపారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో వరుసగా రెండు పర్యాయాలు పర్యటించారు. అక్కడి నుంచి వచ్చిన కొంతమంది నాయకులను తన పార్టీలో చేర్చుకున్నారు. పలు జిల్లాల్లో పర్యటించారు. నూతన కలెక్టరేట్లను ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కానీ ఎప్పుడైతే విపక్షాలు బెంగళూరులో సమావేశం నిర్వహించబోతున్నాయని తెలుసుకున్నారో అప్పుడే ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. గత 5 రోజుల నుంచి అక్కడే ఉంటున్నారు. వ్యక్తిగత సహాయకులను కూడా ప్రగతి భవన్ వద్దే ఉండమని చెప్పారు. కేవలం సంతోష్ కుమార్, కేటీఆర్ కు మాత్రమే ఆయన అందుబాటులో ఉన్నారు. వారితోనూ ముక్తసరిగానే మాట్లాడుతున్నారు.
గతంలో ప్రగతిభవన్ వెళ్ళినప్పుడు కెసిఆర్ మంత్రులతో మాట్లాడేవారు. అవసరమైతే వారినే అక్కడికి పిలిపించుకునేవారు. పలు కీలక విషయాల మీద చర్చించేవారు. కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం కాకముందు వరకు ఆయన ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా గడిపేవారు. వస్తే గిస్తే ఎప్పుడో ఒకసారి ప్రగతి భవన్ లో ప్రత్యక్షమయ్యేవారు. కొత్త సెక్రటేరియట్ కట్టిన తర్వాత దాదాపు ఆయన అక్కడ లేదా ప్రగతిభవన్ లోనే ఉంటున్నారు. కానీ విపక్షాలు కూటమి ఏర్పాటు చేసిన తర్వాత, తన పార్టీకి ఆహ్వానం అందకపోవడంతో ఆయన నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.
ఫామ్ హౌస్ వెళ్ళిపోయిన కెసిఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితికి చెందిన కీలకవర్గాలు అంటున్నాయి. అలా కాదు ఆయన జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ మార్గం ఎలా రూపొందించాలి అనే విషయంపై మధనం చేస్తున్నారని మరి కొంతమంది అంటున్నారు. సుమారు రెండున్నర నెలల తర్వాత కెసిఆర్ ఫామ్ హౌస్ లో మకాం వేయడం, భారత రాష్ట్ర సమితి చెందిన మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఆసక్తికరంగా మారింది. మొన్నటిదాకా బిజెపిని గద్దె దించుతానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఎటువంటి ప్రణాళికలు పొందిస్తున్నారో అంతు పట్టకుండా ఉంది.