KCR Hero Venkatesh : ఉద్యమ సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీ ని లక్ష నాగళ్లతో దున్నుతా అన్నారు. సీఎం అయ్యాక బాప్ రే ఇది హైదరాబాద్ కు గర్వ కారణమని గొప్పగా పొగిడారు. అది కూడా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి. మాదాపూర్ లో చెరువు కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వేషన్ కడితే ఇదెక్కడి న్యాయం, ఆంధ్రా వాళ్ళు తెలంగాణ వనరులు దోచుకుంటున్నారు అని దుయ్య బట్టారు. సీన్ కట్ చేస్తే అదే నాగార్జునకు అభివృద్ధి చేయాలని ఒక అడివిని రాసి ఇచ్చారు. అడవిని అభివృద్ధి చేయడం ఏంటో? కొంప తీసి విల్లాలు గట్రా నిర్మిస్తారా? అది కేసీఆర్ కే తెలియాలి.

-నందకుమార్ హోటల్ ను కూల్చేశారు
కేసీఆర్ ప్రతి ఆలోచనలోనూ రాజకీయం ఉంటుంది. మునుగోడు లో గెలవాలని వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నాడు. ఏమి మా భాగ్యం అనుకుంటూ వారు కూడా ఫామ్ హౌస్ నీడన చేరి పోయారు. అయితే ఈ ఎపిసోడ్ లో మెయినాబాద్ రూపం లో కేసీఆర్ బీజేపీ కి అదిరి పోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఇది మునుగోడు లో కమలాన్ని దెబ్బ తీసింది. ఆఫ్ కోర్స్ కారుకు కూడా బంపర్ మెజార్టీ ఇవ్వలేదు. ఎటొచ్చీ సాంకేతికంగా నే టీఆర్ఎస్ గెలిచిందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇక మొయినాబాద్ ఎపిసోడ్ లో ఉన్న ముగ్గురిలో నంద కుమార్ హైదరాబాద్ వాడే. ఇతడికి దక్కన్ కిచెన్ పేరుతో జూబ్లీహిల్స్ లో ఓ హోటల్ ఉంది. అయితే దానిని ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. దీనిపై ఆరా తీస్తే ఇంట్రస్టింగ్ విషయాలు వెలుగు చూశాయి.

-పింక్ బుల్డోజర్
యూపీ తెలుసు కదా! అక్కడి సీఎం బుల్డోజర్ బాబా గా ఫేమస్. ఎందుకంటే ఎవడైనా తిక్క తిక్క వేషాలు వేస్తే మరుసటి నాడే బుల్డోజర్ వారి ఇంటి ముందు ఉంటుంది. చేయాల్సిన పని చేస్తుంది. అయితే బిజెపి అంటే నచ్చని కేసీఆర్.. అనివార్యంగా అయినా ఆ రూట్ లోకే వెళ్తున్నారు. నంద కుమార్ హోటల్ నిన్న కూల్చేశారు. ఇందుకు చెబుతున్న కారణం అవి అక్రమ నిర్మాణాలట! నోటీసులు ఇచ్చినా నందకుమార్స్ స్పందించ లేదట! వాస్తవానికి ఈ స్థలం హీరో వెంకటేష్, ఆయన అన్న దగ్గుబాటి సురేష్ ది..కొన్నేళ్ల క్రితమే నంద కుమార్ కు వారు లీజుకు ఇచ్చారు. కానీ నంద కుమార్ అందులో నిర్మాణాలు చేపట్టాడు. సురేష్, వెంకటేష్ ఇందేంటని నంద కుమార్ ను ప్రశ్నిస్తే పోపోవోయ్ అన్నాడు. యేహే మీకు దిక్కు ఉన్న చోట చెప్పుకొండి అంటూ ఎదురు తిరుగాడు. దీంతో వారు కోర్టుకి వెళ్ళారు. కోర్టు స్టే విధించింది. అయితే నంద కుమార్ కొన్ని రోజులు సైలెంట్ అయ్యాడు. తర్వాత రాత్రి పూట నిర్మాణాలు సాగించాడు. ఈలోగా మొయినాబాద్ లో దొరికాడు. సురేష్, వెంకటేష్ కేటీఆర్ కు ఆప్తులు కావడంతో పింక్ బల్డోజర్లు శివాలెత్తాయి. నంద కుమార్ హోటల్ ను నేలమట్టం చేశాయి. మొన్నటి దాకా బుల్డోజర్లను వ్యతిరేకించిన కేసీఆర్.. ఇప్పుడు వాటినే రంగంలోకి దింపడం పిటీ! ఆ మధ్య గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం అని కేటీఆర్ అన్నారు. అతి గతి లేదు. ఎలాగూ పింక్ రంగు వేశారు. ఇక బుల్డోజర్లు పంపండి సార్. మీదే లేటు?!