CM Kcr On Paddy: వరి వార్.. దేశంలో వరి పండించే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ, దర్శకత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెల రోజులు ధాన్యం దంగల్ నడిచింది. ఈ వరి కథా చిత్రంలో కేసీఆర్ గెలిచి ఓడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తానే సృష్టించిన వరి పోరులో చి‘వరి’కి కేసీఆర్‌కు ఓటమి తప్పలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దంగల్‌లో రైతులు, ప్రతిపక్షాలే విజయం సాధించారని పేర్కొంటున్నారు.
-లేఖ రాసిచ్చి.. కొత్త డ్రామా!
2022 యాసంగి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి పారాబాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం 2021 ఆగస్టులోనే ఎఫ్‌సీఐకి లేఖ రాసి ఇచ్చింది. ఈ లేఖ ఇచ్చే సమయంలో ప్రభుత్వం రైతు సంఘాలతో ఎలాంటి చర్చలు జరుపలేదు. రైతులకు ఈ విషయాన్ని చెప్పలేదు. ఏకపక్షంగా లేఖ ఇచ్చారు. ఈ యాసంగిలో మళ్లీ కేంద్రం యాసంగి ధాన్యం పూర్తిగా కొనాలని కొట్లాట డ్రామాకు తెర తీశారు.
Also Read: KCR: కేటీఆర్‌కు పోటీగా ఆయన.. బీజేపీ ఆపరేషన్ ఫలిస్తుందా..?
-హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత..
తెలంగాణ రాష్ట్ర సమితిలో నంబర్ 2 గా ఎదుగుతున్న ఈటల రాజేందర్‌ను ఏడాది క్రితం సీఎం కేసీఆర్ పార్టీ నుంచి అవమానకరంగా గెంటేశారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు వివరణ కూడా ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటలను బర్తరఫ్ చేశారు. తీవ్ర అవమానంగా భావించిన ఈటల ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆత్మగౌరవం పేరిట ఒక పెద్ద ఉద్యమమే నడిపారు. ఈటల రాజీనామాతో వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆయనను ఓడించేందకు ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం సర్వశక్తులు ఒడ్డాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. దళితబంధు పథకాన్ని కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టారు. ఓట్ల కోసం పథకం పెట్టుకుంటే తప్పేంటని స్వయంగా ప్రకటించారు. కానీ ఇవేవీ టీఆర్ఎస్ను గెలిపించలేకపోయాయి. ఆత్మగౌరవ పోరాటంలో ఈటల టీఆర్ఎస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించి కేసీఆర్‌కూ ఊహించని షాక్ ఇచ్చారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని ప్రభుత్వం ఎఫ్‌సీఐకి లేఖ ఇచ్చింది.
-ఊహించని ఫలితాలతో ఉగ్రరూపం..
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అనూహ్య ఓటమితో షాక్‌కు గురైన కేసీఆర్.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని ఆయన సన్నిహితులు, పార్టీ నాయకులు చెబుతారు. ఓటమితో ఉగ్రరూపం దాల్చిన కేసీఆర్ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ ఉంది అన్న స్థాయి నుంచి బీజేపీ పేరు ఎత్తకుండా ఏ ప్రెస్‌మీట్ పెట్టని స్థాయికి దిగజారాడు. తన ప్రతిష్టను దిగజార్చుకున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కొట్లాటకు సిద్ధమయ్యారు. అప్పటి వరకు కేంద్రంతో సఖ్యతగా ఉంటూ కేంద్రం నిర్ణయాలను సమర్ధిస్తూ వచ్చిన సీఎం.. హుజూరాబాద్ తర్వాత కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకించడం మొదలు పెట్టారు.
-వరి పోరుతో మైలేజీ వస్తుందని..
కేంద్ర కొత్తగా తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఏడాది తర్వాత గత నవబంర్‌లో ప్రధాని మోదీ ప్రకటించారు. రైతులకు క్షమాపణ కూడా చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే మోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయి. ఇదే సమయంలో కేంద్రంతో యుద్ధానికి సిద్ధమవుతున్న కేసీఆర్ రైతుల విషయంలోనే కేంద్రాన్ని దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. అప్పుడే వానాకాలం వరి కోతలు మొదలవుతుండడంతో అప్పటి వరకు లేని ధాన్యం కొనుగోలు సమస్యను సృష్టించారు. తెలంగాణలో అధిక విస్తీర్ణంలో వరి సాగైంది. ఎఫ్‌సీఐతో చేసుకున్న ఒప్పందం (ఎంవోయూ) కన్నా ఎక్కువ ధాన్యం దిగుబడి వస్తుందని, మొత్తం ధాన్యం కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు. కేంద్రం రైతుల ధాన్యం కొనడానికి వెనుకాడుతోందని ప్రచారం చేయించారు. ఉద్యమానికి పిలుపునిచ్చారు. కేసీఆర్ స్వయంగా ధర్నా చౌక్‌లో ధర్నా కూడా చేశారు. కేసీఆర్ నిరసనలపై స్పందించిన కేంద్రం ముందుగా ఎంవోయూ ప్రకారం 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, తర్వాత ఎక్కువగా ఉంటే మిగతావి కూడా కొంటామని కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ లోక్‌సభలో స్వయంగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం లేని సమస్యను సృష్టిస్తోందని, రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రుల బృందాన్ని కూడా కేసీఆర్ ఢిల్లీకి పంపించారు. తెలంగాణ మంత్రులకు కేంద్రం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ప్రచారం చేయించారు. కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులను అవమానించేలా మాట్లాడాని పత్రికల్లో రాయించుకున్నారు. తర్వాత ఎఫ్‌సీఐ మరో పది లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడంలో వానాకాలం రగడ ముగిసింది.
-యాసంగి వడ్లు వేయొద్దని..
వానాకాలం వడ్ల కొనుగోలు సమస్య సమసిపోవడం.. కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో సీఎం కేసీఆర్ వరి పోరుకు కొనసాగింపుగా ధాన్యం దంగల్–2 కు తెరలేపారు. కేంద్రం యాసంగిలో రాష్ట్రంలో పండే ధాన్యం కొనుగోలు చేయమని చెప్పిందని, తనతో లేఖ కూడా రాయించుకుందని తాను లేఖ ఇచ్చిన విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టారు. లేఖ ఎందుకు ఇచ్చావని ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో కేంద్రం తన మెడపై కత్తిపెట్టిందని, వ్యవసాయ మోటార్లుకు మీటర్లు పెడతానని బెదిరించిందని ప్రచారం చేశారు. యాసంగిలో రైతులెవరూ వరి వెయొద్దని ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఎవరైనా వేసినా ప్రభుత్వం కొనుగోలు చేయదని, కొనుగోలు కేంద్రాలే ఉండవని స్పష్టం చేశారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం చేసుకున్నవారు మాత్రమే వరి వేసుకుని ఒప్పందం మేరకు అమ్ముకోవాలని సూచించారు. మిగతావారు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయలని సూచించారు.
-ఏ పంటలు వేయాలో చెప్పని ప్రభుత్వం..
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పి కేసీఆర్, ఏ పంటలు వేయాలో మాత్రం చెప్పలేదు. ఏ పంటలు వేస్తే మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించలేదు. మండల, జిల్లాస్థాయి వ్యవసాయాధికారులతో వరి వేయొద్ద అని మాత్రమే ప్రచారం చేయించారు. దీంతో అయోమయంలో ఉన్న రైతుల చాలామంది వరి వేయకుండా భూములను బీళ్లుగా వదిలేశారు. కొంతమంది ఆరు తడి పంటలు వేసుకున్నారు. అందురు పొలాలు ఉన్నవారు వరే వేశారు. ఈ క్రమంలో రైతులను వరి వద్దన్న కేసీఆర్ తన ఫాం హౌస్‌లో 150 ఎకరాల్లో వరి వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్పటి వరకు వరి వేసేందుకు వెనుకాడిన రైతులు ఆలస్యంగా కూడా వరి వేశారు. ఇలా సుమారు 50 లక్షల ఎకరాల్లో వరి వేయాల్సి ఉండగా.. 36 లక్షల ఎకరాల్లో సాగుచేసినట్లు ప్రభుత్వం గుర్తించింది.
-కోతల సమయంలో కొట్లాట..
ప్రస్తుతం యాసంగి వరి పొలాలు కోత దశకు చేరుకున్నాయి. మొదట వేసిన పంట కోతలు ఇప్పటికే ప్రారంభమయ్యా. దీంతో మరోసారి రైతు సెంటిమెంట్ రగిల్చారు సీఎం కేసీఆర్.. కేంద్రం వరి కొనాలని కొట్లాట షురూ చేశారు. ఈమేరకు టీఆర్ఎస్ ఎంపీలతో పార్లమెంటులో గొడవ చేయించారు. మంత్రుల కమిటీని ఢిల్లీకి పంపించారు.
-తెలంగాణను అవమానించినట్లు కేంద్ర మంత్రిపై అసత్య ప్రచారం..
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన రాష్ట్ర మంత్రులు యాసంగి ధాన్యం కొనాలని కోరారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వమని లేఖ ఇచ్పి ఇప్పుడు ఈ కొత్త రాజకీయం ఏంటని కేంద్ర మంత్రి సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఎవరూ బాయిల్డ్ రైస్ తినడం లేదని, ఎఫ్‌సీఐ ఏ రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో బాయిల్డ్ రైసే పండుతాయని మంత్రులు చెప్పడంతో అయితే మీ ప్రజలకే విక్రయించండి అని కేంద్ర మంత్రి సూచించారు. దీంతో వెనుదిరిగిన రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజలను నూకలు తినమంటున్నారని ప్రెస్‌మీట్ పెట్టి ప్రనకటించారు. దీనిపై గులాబీ శ్రేణులతో విస్తృతంగా ప్రచారం చేయించారు.
-ఉగాది తర్వాత ఉద్యమం..
ఉగాది పండుగ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు విషయమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా తాము చేపట్టే నిరసనలను ప్రకటించారు. మార్చి 4 నుంచి 8 వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తామని తెలిపారు. 11న ఢిల్లీలో దీ„ý చేస్తామని తెలిపారు. చెప్పినట్లుగానే 4న మండల కేంద్రాల్లో, 6న జాతీయ రహదారుల దిగ్బంధం, 7న కలెక్టరేట్ల ఎదుట నిరసన, 8న రైతుల ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయడం చేపట్టారు. అయితే ఈ నిరసనల్లో రైతులెవరూ పాల్గొనలేదు. రాష్ట్రమంతా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతనిధులే కనిపించారు.
-ఢిల్లీ దీక్షకు ప్రతిపక్షాల మద్దతుకు ప్రయత్నం…
ఈనెల 11న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టే దీక్షకు మద్దతు కోసం బీజేపీ వ్యతిరే పార్టీలను కూడగట్టేందుకు సీఎం విస్తృత ప్రయత్నం చేశారు. ఇందు కోసం పంటి నొప్పి సాకుతో వారం ముందే తన కూతురు, ఎమ్మెల్సీ కవిత, భార్యతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ప్రతిపక్ష నేతలతో రహస్యంగా మాట్లాడి దీక్షకు మద్దతు కోరారు. అయితే ముందే ఎఫ్‌సీఐకి లేఖ ఇచ్చి.. మళ్లీ కొట్లాడడమేంటని వారు ప్రశ్నించినట్లు సమాచారం. కేసీఆర్ దీక్షకు మద్దతు ఇవ్వడానికి వెనుకాడారు. దీంతో రైతు ఉద్యమ నాయకడు రాకేష్ టికాయత్‌ను ఆశ్రయించారు కేసీఆర్. దీక్షకు రావాలని కోరారు. తెలంగాణకు వచ్చిన సమయంలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టిన టికాయత్ ఢిల్లీలో టీఆర్ఎస్ చేపట్టిన దీక్షలో ప్రత్యక్షమయ్యారు. టికాయత్ మినహాయిస్తే మిగతావారంతా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిదులు, నాయకులే. ఒక్క రైతు కూడా దీక్షలో కనిపించలేదు.
-జరుగబోయే పరిణామాలను ముందు ఊహించి..
నిరసన లపై కేంద్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఢిల్లీలో దీక్ష చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే ఉక్కుపాదంతో కేసీఆర్ అణచివేస్తున్నారు. ఈ విషయం తెలిసినా ఎలాంటి ఆటంకం కలిగించలేదు. దీక్షలో మాట్లాడిన కేసీఆర్ ఆందోళనకు బీజేపీ వ్యతిరేక పక్షాలు కలిసి రాకపోవడంతో జరబోయే పరిణామాలు అర్థమయ్యాయి. అయినా పరువు పోకుండా ఉండేందుకు సభలో గాంభీర్యం ప్రకటించారు. కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ విధించారు. గంటలోపే దీక్షను ఎత్తివేశారు. ఆ వెంటనే రాష్ట్రానికి తిరిగి వచ్చారు. మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించి తానే ధాన్యం కొంటున్నట్లు ప్రకటించారు.
మొటి నుంచి రైతులను ఆగం చేయొద్దని, బాయిల్డ్ రైస్ రైతులు పండించరని, మిల్లర్ల కోసమే కేసీఆర్ వరి కొనుగోలు డ్రామా ఆడుతున్నారని మొదటి నుంచి ప్రతిపక్షాలు ఆరోపించాయి. మిల్లర్లకు బోనస్ ఇస్తే బాయిల్డ్ రైస్ ఇవ్వరని, రా రైస్ ఇస్తారని తెలిపారు. చి‘వరి’ పోరులో కేసీఆర్ ప్రతిపక్షాలు చెప్పిన దారిలోకే వచ్చారు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నట్లు నూకల నష్టం భరించేందుకే సిద్ధమయ్యారు. రైతు ఉద్యమం తనకు మైలేజ్ తెస్తుందనుకున్న కేసీఆర్.. ఉద్యమం పేరుతో గెలిచిన ఓడిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: Telangana: మాకేం తక్కువ.. బావలకు మందుబాటిళ్లు పెడుతున్న బామ్మర్దులు.. ఇదేం ట్రెండ్ రా నాయనా..
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Kcr govt to buy paddy stock hits out at centre
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com