Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు గత ఎంతలా ఎదురు చూస్తున్నారో మనం సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. కానీ అభిమానుల నుండి ఈ సినిమా మేకర్స్ పట్ల ఒక తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఇది రామ్ చరణ్ కి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం. #RRR తర్వాత ఆయన స్టార్ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ కి ఎగబాకింది. దానికి తోడు ఆరేళ్ళ తర్వాత తమ అభిమాన హీరో నుండి విడుదల కాబోతున్న సోలో హీరో చిత్రమిది. శంకర్ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకుడు. అలాంటి సినిమాకి సరైన రీతిలో ప్రోమోషన్స్ చేయడం లేదని అభిమానుల నుండి వినిపిస్తున్న వాదన.
ఈ సినిమాకి సరిగా నేటి నుండి 13 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు థియేట్రికల్ ట్రైలర్ విడుదల అవ్వలేదు. సినిమాకి సంబంధించిన ఏ ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయడం లేదు. దీంతో అభిమానులు చాలా తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ఈశ్వర్ అనే రామ్ చరణ్ వీరాభిమాని మూవీ టీం ని ట్యాగ్ చేస్తూ ఆత్మహత్య లేఖని రాశాడు. ఆ లేఖలో ఏముందంటే ‘నేను చరణ్ అన్నయ్య వీరాభిమానిని. ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదలకు ఇప్పటి నుండి కేవలం 13 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు థియేట్రికల్ ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ కొత్త సంవత్సరం మొదలు అయ్యేలోపు ట్రైలర్ ని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాను’ అంటూ ఒక లేఖని విడుదల చేసారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.
దీనికి మూవీ టీం స్పందిస్తూ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ప్రోమోషన్స్ ప్లానింగ్ ప్రకారమే జరగబోతుంది. అభిమానులారా మీ ఆత్రుతని మేము అర్థం చేసుకోగలం. దయచేసి కాస్త సమన్వయం పాటించండి అంటూ రిక్వెస్ట్ చేసారు. అభిమానుల నుండి ఇలాంటి లేఖలు రావడం కొత్తేమి కాదు. గతంలో కూడా ఇతర హీరోలకు ఇలాంటి సందర్భాలు ఎదురు అయ్యాయి. వీటిని చూసిన నెటిజెన్స్ ఇవేమి వెర్రి అభిమానంరా బాబు, హీరోల మీద ఇంతలా చూపించే శ్రద్ద మీ భవిష్యత్తు మీద చూపించండి. వందల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి సినిమాలను తీసిన వాళ్లకు ఇవన్నీ తెలియదా?, మీరు చెప్తేనే వాళ్ళు చేస్తారా?, సినిమా అనేది కేవలం ఒక వినోదం మాత్రమే, అదే జీవితం అవ్వకూడదు అంటూ క్లాస్ పీకుతున్నారు. ఇది ఇలా ఉండగా వారం రోజుల క్రితం డల్లాస్ లో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జీ తెలుగు లో ప్రసారం కాబోతుంది.