ఇన్నాళ్లుగా మద్యం టెండర్లలో ఎలాంటి రిజర్వేషన్లు లేవు. ఎవరు ఎక్కువగా టెండర్ వేస్తే వారికే షాపులు దక్కేవి. ప్రస్తుతం సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. దీంతో అన్ని వర్గాలకు లాభం చేకూరే అవకాశముంది. ఇందులో గౌడ కులస్తులకు పదిహేను శాతం, ఎస్సీలకు పది శాతం, ఎస్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. దీంతో అన్ని వర్గాలకు సముచిత న్యాయం దక్కేలా కనిపిస్తోంది.
ఇంతకు ముందు మద్యం దుకాణాల లైసెన్సులు రెండోళ్లకోసారి నిర్వహించేవారు. ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ఈ నెలతో ముగుస్తుంది. తరువాత సామాజిక వర్గాలకు కేటాయించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. ఇంతవరకు లేని రిజర్వేషన్లు ఇప్పుడు తెరపైకి తేవడంతో మద్యం దుకాణాలు నిర్వహించే వారికి నష్టం జరిగే సూచనలున్నాయి. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీతో అందరికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
సామాజిక వర్గాల వారీగా కేటాయించే మద్యం దుకాణాల టెండర్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం కలుగుతుందని భావించినా వారి పేరు మీద పెద్ద తలకాయలు తీసుకునేందుకు కూడా మార్గం కనిపిస్తోంది. దీంతో మద్యం దుకాణాలు దక్కించుకునేందుక పావులు కదువుతున్నారు. డబ్బులు పెడుతూ పేరుకు వారిని ముందుకు తీసుకొచ్చి తద్వారా దుకాణాలు కొట్టేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.