PBKS vs RR, IPL 2021: మెజారిటీ క్రికెట్ ప్రేమికులు టీ20ని ఇష్టపడడానికి ప్రధాన కారణం.. ధనాధన్ బ్యాటింగ్, ఫటాఫట్ వికెట్లే! ఏ బంతి ఫలితాన్ని ఎలా మారుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అప్పటి వరకూ దుర్భేద్యంగా సాగిన బ్యాటింగ్.. ఒక్కసారిగా పేకమేడలా కూలిపోవచ్చు. అప్పటి దాకా గడగడలాడించిన బౌలర్లకు.. బ్యాట్స్ మెన్ చుక్కలు చూపించొచ్చు. గెలుస్తుందనుకున్న జట్టు విజయపు వాకిట్లో బొక్కబోర్లా పడొచ్చు. పనైపోయిందనుకున్న జట్టు.. గెలుపును ఒడిసిపట్టొచ్చు. అందుకే.. టీ20 ఫార్మాట్ కు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అయితే.. ఈ పొట్టి క్రికెట్ మజా ఏంటో చాటిచెప్పింది పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్.
ఆఖరి బంతి వరకు దోబూచులాడిన ఫలితం.. ఓడిపోతుందన్న జట్టు చెంతకు చేరింది. ఈ మ్యాచ్ చూసిన వారంతా.. వారెవ్వా భలే మ్యాచ్ ను చూశామని అనుకుని తీరుతారంటే.. ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 185 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జైస్వాల్ (49), మహిపాల్ (43) విజృంభించడంతో రాజస్థాన్ భారీ స్కోరు సాధించింది.
186 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్లు రాహుల్ (49), మయాంక్ అగర్వాల్ (67) సెంచరీ భాగస్వామ్యంతో అద్భుతమైన ఓపెనింగ్ అందించారు. ఆ తర్వాత పూరన్ (32), మక్రాం(26) కూడా చక్కగా రాణించినప్పటికీ.. ఆ తర్వాత వికెట్లు వెంట వెంటనే కుప్పకూలాయి.
చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 4 పరుగులు అవసరమయ్యాయి. ఆరు బంతుల్లో ఒక్క బౌండరీ వెళ్లినా విజయం దక్కుతుంది కాబట్టి.. అందరూ పంజాబ్ దే గెలుపు అని నమ్మారు. కానీ.. రాజస్తాన్ బౌలర్ కార్తీక్ త్యాగి(karthik tyagi) వారి ఆశలను వమ్ము చేవాడు. తొలి బంతి డాట్ వేశాడు త్యాగి. రెండో బంతికి మక్రాం సింగిల్ తీశాడు. మూడో బంతికి పూరన్ ఔట్ కావడంతో.. పరిస్థితి తలకిందులైంది. మూడు బంతుల్లో మూడు పరుగులు కావాలి. నాలుగో బంతి మళ్లీ డాట్ వేశాడు త్యాగి. ఐదో బంతికి ఏం జరుగుతుందన్న ఉత్కంఠలో వికెట్ పడేశాడు కార్తీక్ త్యాగి. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతిని డాట్ చేశాడు త్యాగి. ఆ విధంగా.. రాజస్థాన్ జట్టు ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.