KCR – MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఉద్యమకారులు గుర్తొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, తమ సరస్వం కోల్పోయిన వారిని అధికారంలోకి వచ్చాకా కేసీఆర్ పట్టించుకోలేదన్న అపవాదు ఉంది. ఉద్యమద్రోహులకు, ఉద్యమ వ్యతిరేకులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లతోటు మంత్రి పదవులు కూడా ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమకారులకు గులాబీ బాస్ ప్రాధాన్యత ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమపై ఉన్న అపవాదు కొంతైనా పోగొట్టుకోవాలని భావించిన కేసీఆర్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, నవీన్‌కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేశారు.
-ఇద్దరు ఉద్యమకారులే..
తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా ప్రకటించినవారిలో ఇద్దరు తెలంగాణ ఉద్యమకారులే. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్‌కుమార్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దేశపతి శ్రీనివాస్ తన కలం, గళంతో ఉద్యమానికి తనవంతు సాయం చేశారు. ప్రస్తుతం సీఎం కార్యాలయ ఓఎస్డీగా ఉన్నారు. చాలాకాలంగా ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. ఎట్టకేలకు కేసీఆర్ కరుణించారు. ఇక నవీన్‌కుమార్ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఉద్యమించాడు. నవీన్‌కుమార్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక ఇటీవలే బీర్‌ఎస్‌లో చేరిన జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనువడు చల్లా వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. బీఆర్‌ఎస్ విస్తరణలో చల్లాకు కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
-9న నామినేషన్..
బీఆర్‌ఎస్ తరఫున ప్రకటించిన ముగ్గురు దేశపతి శ్రీనివాస్, నవీన్‌కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి ఈనెల 9న ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేయనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చూడాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
-గవర్నర్ కోటా పోటీలో ముగ్గురు..
ఇక గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థులను ఎల్లుండి కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఈ మేరకు భిక్షమయ్యగౌడ్, దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ తదితర పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో పాడి కౌశిక్‌రెడ్డి పేరును కేబినెట్ సిఫార్సు చేసినప్పుడు.. గవర్నర్ ఆమోదించలేదు. దీంతో ఇప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై గులాబీ బాస్ పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారు.