
Adani power plant : హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అదానీ గ్రూప్ పుట్టి మునిగే ప్రమాదం కన్పిస్తోంది. ఇప్పటికే అదానీ గ్రూప్‌కు సంబంధించిన పలు కంపెనీల షేర్లను మదుపుదారులు అమ్మేస్తున్నారు. మరోవైపు జాతీయ బ్యాంకులు తప్ప మిగతా సంస్థలు రుణాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో నగదు లభ్యత లేక కంపెనీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. లాజిస్టిక్స్ తప్ప మిగతా రంగాలన్నీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.
మరో మాయాజాలం వెలుగులోకి
అదానీ గ్రూప్ మరో మాయాజాలం వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని ముంద్రాలో ఏర్పాటు చేసిన భారీ థర్మల్ పవర్ ప్లాంట్ పీకల్లోతు నష్టాల్లో ఉన్నా.. ఆ ప్లాంట్‌కు ఉదారంగా అదానీ పవర్ అనుబంధ సంస్థ నుంచి 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.8,250 కోట్లు) రుణాలు సమకూర్చింది. ఆడిటర్ల అభ్యంతరాలను సైతం కాదని అదానీ గ్రూప్ పెద్దలు రుణ పత్రాల రూపంలో ముంద్రా ప్లాంట్‌కు ఉదారంగా ఈ రుణం సమకూర్చారు. ఈ రుణాల చెల్లింపులకు ఎలాంటి హామీ లేదు. అదానీ పవర్ అడిగితే మాత్రం ఏటా 10ుచొప్పున వడ్డీ చెల్లించాలి.
అసలుకే మోసం వచ్చే ప్రమాదం
అదానీ పవర్ మొత్తం ఆస్తుల్లో ముంద్రా ప్లాంట్ వాటా నాలుగో వంతు వరకు ఉంటుంది. రూ.14,718 కోట్ల భారీ నష్టాలతో ఉన్న ఈ ప్లాంట్ పుట్టి మునిగితే ఆ ప్రభావం అదానీ పవర్ కంపెనీ ఇన్వెస్టర్లపైనా పడుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 4,620 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ నుంచి విద్యుత్ కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఏదోలా ప్లాంట్‌ను నడపాలనే ఉద్దేశంతో అదానీ గ్రూప్ ఈ ప్లాంట్ నడుపుతోంది. ప్రస్తుతం తన ఉత్పత్తి సామర్ద్యంలో 20 శాతానికి మించి ఉపయోగించుకోలేకపోతోంది. దీంతో ఏటికేటికి నష్టాలు పెరిగి పోతున్నాయి.
ప్లాంట్ చరిత్ర:
విద్యుత్ రంగంలోకి ప్రైవేటు రంగాన్ని అనుమతించడంతో 15 ఏళ్ల క్రితం అదానీ గ్రూప్ 4,620 మెగావాట్ల భారీ సామర్ధ్యంతో గుజరాత్‌లోని ముంద్రాలో ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇండోనేషియాలోని తన బొగ్గు గనుల నుంచి ఈ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు సరఫరా చేయాలని అదానీ గ్రూప్ తొలుత భావించింది. అయితే ఇండోనేషియా ప్రభుత్వం తన దేశం నుంచి ఎగుమతి చేసే బొగ్గుకు కనీస ధర నిర్ణయించడంతో అదానీ పథకం బెడిసి కొట్టింది. పోనీ పెరిగిన ధరతో ప్లాంట్ నడిపి, విద్యుత్ అమ్ముదామా? అంటే కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. దీంతో రూ.14,718 కోట్ల భారీ నష్టాలతో ముంద్రా ప్లాంట్ అదానీ గ్రూప్‌నకు పెద్ద గుదిబండలా మారింది.