
KCR – Governor : “సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని నికోలస్ కోపర్నికస్ కనిపెట్టాడు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్యుడే అని, సూర్యుడి చుట్టే భూమి తిరుగుతుందని నిరూపించాడు. కానీ ప్రస్తుత రాజకీయ నాయకులు ” సన్” కేంద్రక సిద్ధాంతాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారు. కాదు కాదు ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారు. కానీ ఇవి ఎక్కువ కాలం మన్నవు.. ఎప్పుడో ఒకప్పుడు సన్ స్ట్రోక్ తగులుతుంది” అని హెచ్చరించారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. తెలంగాణ ప్రభుత్వంతో తనకు ఇంకా పంచాయితీ తీరిపోలేదని స్పష్టం చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే కనీసం తనను పిలవలేదని ఆమె బాధపడ్డారు.
గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ మధ్య గవర్నర్ కొన్ని బిల్లులను పక్కన పెట్టారు. అయితే దీనిపై కేటీఆర్ కు దగ్గరగా ఉండే కొంతమంది నాయకులు ఆందోళన చేశారు. రాజ్ భవన్ ఎదుట నిరసన తెలిపారు. తమిళసైకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు సందర్భాల్లో కూడా కేటీఆర్ గవర్నర్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ తెరపైకి తీసుకువచ్చిన బిల్లులో తన సందేహాలు నివృత్తి చేయాలని కోరితే ఆ శాఖ మంత్రి హరీష్ రావు గవర్నర్ వద్దకు వచ్చారు. ఆమెతో చాలాసేపు మాట్లాడారు. అదే పురపాలక శాఖకు సంబంధించి అసమ్మతి విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో సందేహాలు నివృత్తి చేయాలని కోరితే.. ఆ శాఖను చూస్తున్న మంత్రి కేటీఆర్ గవర్నర్ వద్దకు రాలేదు. దీంతో అప్పటి నుంచే గవర్నర్ కేటీఆర్ పై ఒకింత ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాదు ఆ మధ్య మేడ్చెల్ లో జరిగిన సభలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని కేటీఆర్ కోరారు. ఇది తమిళి సై కి మరింత ఆగ్రహం తెప్పించింది.
ఇక అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పిలువకపోవడం, ప్రభుత్వం తనను కావాలనే టార్గెట్ చేస్తుండటంతో గవర్నర్ ఒకింత నామర్థకు గురయ్యారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నేపథ్యంలో నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఇందులో కేసీఆర్ ని కూడా వదిలిపెట్టలేదు.. చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వారు, రేపటి నాడు అందుకు తగ్గట్టుగానే ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని గవర్నర్ హెచ్చరిస్తున్నారు.
ఇక గవర్నర్ మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు సంబంధించి గవర్నర్ ఆమోదించకపోవడంతో కెసిఆర్ గుర్రుగా ఉన్నారు. అయినప్పటికీ గవర్నర్ వెనుకంజ వేయలేదు. కక్షపూరిత రాజకీయాలకు పెట్టింది పేరైన కేసీఆర్.. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు గవర్నర్ ని ఆహ్వానించలేదు. దీనిని మనసులో పెట్టుకున్న ఆమె తన ఆగ్రహాన్ని కెసిఆర్ కు సన్ స్ట్రోక్ రూపంలో అర్థమయ్యేలా వివరించింది. అయితే పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. రేపటి నాడు ఎన్నికల సమీపించిన తర్వాత గవర్నర్ పాత్ర రాష్ట్రంలో అధికంగా ఉంటుందని, అప్పుడు ఎలాంటి పరిణామాలను చవి చూడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.