‘ఒకే మనిషి.. కానీ రెండు నాల్కలు’ అని అంటుంటారు. సరిగా సీఎం కేసీఆర్ వైఖరి కూడా అలానే ఉంది. కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్‌ను ఎప్పుడు మెచ్చుకుంటారో.. ఎప్పుడు విమర్శిస్తారో ఎవరికీ తెలియదు. అప్పుడే ఫైటింగ్ అంటారు.. అప్పుడే ఫ్రెండ్‌షిప్ అంటారు. లాక్‌డౌన్ పీరియడ్‌లో మోదీకి మద్దతుగా చప్పట్లు కొట్టిన కేసీఆర్.. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా కయ్యానికి కాలు దువ్వడానికి సాహసిస్తున్నారు.
Also Read : బీజేపీ ఆలోచననే జగన్ ఆచరణలో పెడుతున్నారా?
మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ లోపల, వెలుపల టీఆర్‌ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో రాజీపడకుండా పోరాడాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిలదీయాలని హుకూం జారీ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణ జలాల వివాదం పరిష్కారం కేంద్రం చేతిలో ఉంది. కానీ.. ఇంకా ఆ సమస్యను మోదీ ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో సీఎం కేసీఆర్ గుస్సా అవుతున్నారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదనే కోపం కూడా ఉంది. వీటన్నింటికి తోడు తాము కేంద్రం వైఖరితో రాష్ట్రంలో ఎక్కడా తమ మీద వ్యతిరేకత వస్తుందోననే బెంగ ఉంది. నూతన విద్యుత్ పాలసీని కేసీఆర్ వ్యతిరేకించారు.
అలాగే.. జాతీయ రహదారులపై కేంద్రం మాట తప్పింది. రాష్ట్రానికి రావల్సిన 22 నవోదయ పాఠశాలలపైనా కేంద్రం నోరు మెదపడం లేదు. ఇక ప్రధానంగా జీఎస్టీ బకాయిలపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. వీటన్నింటిపై పార్లమెంట్‌లో గళం విప్పాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. మరి ఓ రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్.. ఇప్పుడు దేశ ప్రధానితో కయ్యానికి దిగితే అది ఎంతవరకు సక్సెస్ అవుతాడు? మోదీతో ఫైట్‌లో కేసీఆర్ నెగ్గుతాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది.
Also Read : తెరాస -మజ్లిస్ వైరం నిజమా ? కొత్త నాటకమా?