Draupadi Murmu Vist Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిజెపిపై ఇప్పట్లో పగ చల్లారే అవకాశాలు కనిపించడం లేదు.. ప్రధానమంత్రి తెలంగాణకు పలుమార్లు వచ్చినప్పటికీ స్వాగతం పలకకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఆ తంతు కొనసాగించాడు. రాష్ట్రపతి శీతకాల విడిదికి హైదరాబాద్ కు వస్తే స్వాగతం పలకకుండా… మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ ను పంపించాడు.. వాస్తవానికి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి హైదరాబాద్ కు వస్తున్నారని తెలియగానే కెసిఆర్ ఆమెకు స్వాగతం పలుకుతారా? లేదా? అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈసారి కెసిఆర్ తన మనసు మార్చుకున్నారని, రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారని అందరూ అనుకున్నారు.. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ ఆమెకు స్వాగతం పలకలేదు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ద్వారా రాష్ట్రపతికి స్వాగతం పలికించారు. కెసిఆర్ రాకపోవడానికి గతంలో అనేక కారణాలు చెప్పిన సీఎంవో.. ఈసారి మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. అంటే కెసిఆర్ లక్ష్యం ఏమిటో స్పష్టం అవుతూనే ఉంది.

కెసిఆర్ మార్క్
ద్రౌపదిని ఆహ్వానించేందుకు సత్యవతిని పంపడ వెనుక కేసీఆర్ వ్యూహం దాగి ఉంది.. ఎందుకంటే రాష్ట్రపతి ఝార్ఖండ్ లోని సంతాలి తెగకు చెందినవారు. ఈ తెగ దేశ స్వాతంత్ర పోరాటంలో ముందుండి పోరాడింది. పైగా వీరు గిరిజనులు. మరోవైపు సత్యవతి రాథోడ్ కూడా గిరిజన నేపథ్యానికి చెందిన మహిళ.. ఈ క్రమంలో ద్రౌపదికి ఒక గిరిజన మహిళ ప్రజా ప్రతినిధితో కెసిఆర్ స్వాగతం పలికించారు. దీనిపై అటు బిజెపి నేతలు కూడా విమర్శించే అవకాశం లేకుండా చేశారు.. మరోవైపు తాను స్వాగతం పలకకుండా కేసీఆర్ రివెంజ్ తీర్చుకున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో ఉన్న గొడవల నేపథ్యంలో అప్పట్లో ద్రౌపదికి కేసీఆర్ మద్దతు ఇవ్వలేదు. విపక్షాలు నిలబెట్టిన యశ్వంత్ సిన్హా కు మద్దతు పలికారు.. అంతేకాదు హైదరాబాదులో ప్రచారం కోసం వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు.. కనీ విని ఎరుగని స్థాయిలో ఏర్పాటు చేశారు.. అప్పట్లో కెసిఆర్ చేసిన పనికి దేశం మొత్తం నోరెళ్లబెట్టింది.. అయినప్పటికీ ఆయన వెనక్కు తగ్గలేదు.. పైగా తాను మద్దతు ప్రకటించిన అభ్యర్థి ఓడిపోవడం, ద్రౌపది గెలుపొందడంతో మనసు నొచ్చుకున్న కేసీఆర్ స్వాగతం పలికేందుకు నిరాసక్తత ప్రదర్శించారని తెలుస్తోంది.. మరోవైపు రాష్ట్రపతి హైదరాబాద్ లో దిగిన అనంతరం ఆమె నేరుగా శ్రీశైలం వెళ్ళిపోయారు. అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. ఆ పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే ఆమెకు కేసిఆర్ స్వాగతం పలుకుతారనే ప్రచారం జరుగుతున్నది.

గతంలోనూ ఇలానే
కెసిఆర్ బిజెపితో యుద్ధం ప్రకటించిన తర్వాత… ప్రతి విషయంలోనూ తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పటివరకు పలుమార్లు హైదరాబాద్ కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలకలేదు.. ప్రధాని వచ్చినన్ని సార్లు స్వాగతం పలికేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాత్రమే పంపారు. ఇక గవర్నర్ తో అయితే అమీ తుమీ తేల్చుకునేందుకే సిద్ధపడ్డారు.. పలు విషయాల్లో ఆమెపై నేరుగానే విమర్శలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దానికైతే లెక్కేలేదు. అయితే ఈరోజు రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు కేసిఆర్ వెళ్లకపోవడంతో కొన్ని మీడియా సంస్థలు వివాదం చేసేందుకు ప్రయత్నించడం గమనార్హం.. అయితే ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకొని తెలంగాణకు వచ్చే రాష్ట్రపతికి కెసిఆర్ స్వాగతం పలుకుతారా లేదా అనేది త్వరలో తేలిపోతుంది.. బొల్లారంలో విడిది గృహంలో రాష్ట్రపతి ఐదు రోజులు బస చేస్తారు.. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి.. రాష్ట్రపతి విడిది గృహాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.