KCR- RTC Employees: మూడేళ్ల క్రితం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినా.. హామీ నెరవేరిస్తేనే సమ్మె విరమిస్తామని భీష్మించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కేసీఆర్… ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించి వారిని తొలగించినంత పనిచేశారు. 50 రోజులకుపైగా సాగిన సమ్మెతో చాలా మంది కార్మికులు మనస్తాపం చెందారు. కొందరు చనిపోయారు. అయినా.. కేసీఆర్ మనసు కరగలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. మరోవైపు ఉద్యోగ సంఘాలు కార్మికులను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలే లేకుండా చేశారు.
దెబ్బకు ఉద్యమాన్నే మర్చిపోయారు..
రెక్కలు విచిరిన పక్షిలా ఆర్టీసీని తయారు చేశారు కేసీఆర్. దీంతో ఆ సమ్మె తర్వాత ఉద్యమించడమే మర్చిపోయారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరిస్తున్నారు తప్ప గొంతెత్తే సాహసం చేయడం లేదు. బకాయిలు చెల్లించకపోయినా, పీఆర్సీ అమలు చేయకపోయినా.. పీఎఫ్ డబ్బులు సకాలంలో చెల్లించకపోయినా.. అధికారులు వేధిస్తున్నా మౌనంగా భరిస్తున్నారు.
అడగకుండానే విలీన వరం..
కానీ పాలనలో కేసీఆర్ స్టైలే వేరు కదా.. పోల్ మేనేజ్‌మెంట్‌లో ఆయనకు ఆయనే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పుడు వారెవరూ అడగకుండానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆర్టీసీ మొత్తాన్ని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదు. అందుకే ఏపీలోలా ఆర్టీసీని అంతే ఉంచి ఉద్యోగుల్ని మాత్రం ప్రభుత్వంలో భాగం చేస్తారు. ఏం చేయాలి.. ఎలా చేయాలన్నదానిపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. ఆర్టీసీలో పని చేసే ఉద్యోగులుం ప్రభుత్వ ఉద్యోగులే. అయితే వారు ఆర్టీసీ కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉంటారు .
వ్యతిరేకతను గుర్తించే..
ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగులకు హైదరాబాద్‌లో తప్ప ఇతర జిల్లాల్లో సమయానికి జీతాలు రావడం లేదు. ఆర్టీసీ వాళ్ల పరిస్థితి అంతే. జీతం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. అయితే మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయం అమల్లోకి వస్తుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి.