
సీఎం కేసీఆర్ శాశ్వతంగా ఎదుర్కొనే విమర్శల్లో ఒకటి.. దళిత ముఖ్యమంత్రి వాగ్ధానం అమలు చేయకపోవడం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో.. పలు వేదికల మీద, పలుమార్లు ఈ హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి దళితుడే అని స్పష్టంగా చెప్పారు. కానీ.. తర్వాత తానే పీఠం ఎక్కారు.
ఆ తర్వాత దళితులకు మూడెకరాల భూమి వంటి పథకాలు ప్రవేశపెట్టినా.. అది ప్రచారానికి మాత్రమే పనికొచ్చిందన్నది దళిత సంఘాల విమర్శ. ఆ తర్వాత అంతా సైలెంట్ గా సాగిపోతూనే ఉంది. అయితే.. ఉన్నట్టుండి మరోసారి దళిత గానం అందుకున్నారు కేసీఆర్. దళిత్ ఎంపవర్ మెంట్ పేరుతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, సరికొత్త చర్చకు తెరతీశారు. దళిత కుటుంబాలకు అందించే సహకారం గురించి కూడా హామీలు గుప్పిస్తున్నారు.
దీంతో.. ఏం జరుగుతోంది? అనే చర్చ అయితే రాష్ట్రంలో మొదలైంది. ఉన్నట్టుండి కేసీఆర్ కు దళితుల మీద ప్రేమ పొంగడానికి కారణమేంటని రాజకీయవర్గాల్లో, ప్రజల్లో చర్చ సాగుతోంది. అయితే.. కొందరు పరిశీలకులు మాత్రం హుజూరాబాద్ ఎన్నికను చూపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 46 వేల పైచిలుకు దళితుల ఓట్లు ఉన్నాయని సమాచారం. ఈ ఓట్లను క్యాచ్ చేసేందుకు కేసీఆర్ ఈ వ్యూహం మొదలు పెట్టారని చెబుతున్నారు.
హుజూరాబాద్ ఎన్నిక టీఆర్ఎస్ కు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న బీజేపీలోకి ఈటల వెళ్లడం.. నియోజకవర్గంలో ఈటల పాతుకుపోయి ఉండడంతో.. అధికార పార్టీకి ఇక్కడ గెలుపు అనేది అంత ఈజీగా వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. టీఆర్ఎస్ పై మరింత ఒత్తిడి పెరగడం ఖాయం. అందుకే.. ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఇందుకోసమే.. అందుబాటులో ఉన్న అస్త్రాలన్నింటినీ బయటకు తీస్తున్నట్టు చెబుతున్నారు. ఈ అస్త్రాల్లో ఒకటే దళితరాగం అని అంటున్నారు. మరి, కేసీఆర్ ఆశిస్తున్నట్టుగా దళితుల ఓట్లు టీఆర్ఎస్ కు పడతాయా? హుజూరాబాద్ లో గులాబీ గుబాళిస్తుందా? కమలం వికసిస్తుందా? అన్నది చూడాలి.