Gajwel BRS
BRS: సెంటిమెంటు.. కేసీఆర్‌కు ఇది బాగా కలిసి వచ్చే పదం. ఆయన ఏ పని చేసినా సెంటిమెంట్ చూసుకుంటారు. కలిసి వచ్చే పనులనే చేస్తారు. చివరకు హరితహారంలో కూడా తనకు కలిసివచ్చే మొక్కనే నాటారు. ఇక పథకాల ప్రారంభం, పార్టీ కార్యాలయాల ప్రారంభం, టికెట్ల కేటాయింపు, జిల్లాల పునర్విభజన ఇలా అన్నీ తనకు కలిసివచ్చేలా చేసినవే. యజ్ఞాలు, యాగాలు, సెంటిమెంటును బాగా నమ్మే కేసీఆర్ ఈసారి ఎన్నికల ప్రచారం కూడా తన సెంటిమెంట్ ప్రకారం ప్రారంభించాలని భావిస్తున్నారు. సెంటిమెంట్ కొలిసి వస్తే కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం.
వరంగల్ సెంటిమెంట్..
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమాన్ని కొనసాగిస్తూనే.. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా కొత్త పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నారు. తొలుత ఈ నెల 16న వరంగల్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్న ఆయన ఆ తర్వాత వరుస ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. పూర్తిస్థాయిలో అభ్యర్ధులను ప్రకటించి అన్ని నియోజకవర్గాలను చుట్టేలా ప్రణాళిక ఖరారు చేస్తున్నారని సమాచారం. అయితే తాను సెంటిమెంట్‌గా భావించే వరంగల్‌నుంచి సభలు మొదలుపెట్టి రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ పార్టీ వరంగల్‌లో ఎప్పుడు సభ నిర్వహించినా భారీగా సక్సెస్ అవుతుంది. సీఎం కేసీఆర్‌కు కూడా వరంగల్ ఒక సెంటిమెంట్ కావడంతో.. అక్కడే మేనిఫెస్టోను ప్రకటించాలని భావిస్తున్నారు.
ఓరుగల్లు నుంచే సమరశంఖం..
వరంగల్ సభలోనే తెలంగాణ ఎన్నికలకు కేసీఆర్ సమర శంఖారావం పూరించనున్నారు. ఇప్పటికే టికెట్ల కేటాయింపులో విపక్షాలకు రెండు నెలల ముంద ఉన్నారు. ఒకేసారి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. విపక్ష కాంగ్రెస్, బీజేపీ ఇంకా టికెట్ల కేటాయింపు కసరత్తులోనే ఉన్నాయి. ఈనేపథ్యంలో ప్రచారంలోనూ ముందుండాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈలోగా ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో.. వరంగల్ సభ పూర్తిగా పార్టీ కార్యక్రమంగా సాగనున్నది.
మహిళా ఓటర్లు ఎక్కువ..
ఎన్నికల కమిషన్ ప్రకటించిన తాజా ఓటర్ల తుది జాబితాలో మహిళా ఓటర్లే 76 నియోజకవర్గాల్లో మెజార్టీలో ఉన్నారు. ఆయా నియోజకవర్గాలలో గతంలో కూడా మహిళా ఓటింగ్ శాతమే ఎక్కువగా నమోదైంది. దీంతో వారిని ఆకట్టుకుంటే తప్పకుండా గెలుపు సాధ్యం అవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మహిళలే లక్ష్యంగా భారీ పథకాలు ప్రకటించాలని కేసీఆర్ ఆలోచన. దసరా కానుకగా మేనిఫెస్టోను ప్రకటిస్తారని.. ఆ తర్వాత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ పరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పథకాలకు దీటుగా…
కాంగ్రెస్ ప్రకటించిన హామీల అమలు సాధ్యాసాధ్యాలను ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు కష్టసాధ్యమేనని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని ప్రజలకు వివరిస్తూనే పెన్షన్ల మొత్తాన్ని పెంచేందుకు దాదాపు నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. నిరుద్యోగ భృతి.. రైతుబంధు పెంపు.. రైతు రుణమాఫీ వంటి అంశాల పైన నిర్ణయం తీసుంటారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన వంట గ్యాస్ సబ్సిడీ ప్రకటనకు దీటుగా కొత్త పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సభలో ప్రజల ముుందుకు వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, ఈ సభలో కేసీఆర్ చేసే ప్రకటనలపై ఆసక్తి నెలకొంది.