Etela Rajender- KCR: మునుగోడులో విజయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిగజారిపోయారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. తాను వీరుడిని సూరుడుని అని చెప్పుకుంటున్న కేసీఆర్ ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని ఈటల తీవ్ర ఆరోపణ చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చానని చెప్పుకున్న ముఖ్యమంత్రి.. చివరకు ఎన్నికల రోజు టీఆర్‌ఎస్‌కు ఓట్లు పడేలా చూడాలని అధికారులకు స్వయంగా ఫోన్‌చేశారని తెలిపారు. ఒక్క ఎమ్మెల్యే సీటు పోతే మాకేం కాదు అన్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఓటమి భయంతో తాను ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతున్నారని ఆరోపించారు.

సంక్షేమం ఏమైంది..
తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు మునుగోడులో వాటిని ప్రచారం చేసుకుని ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు. ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేశారని ఆరోపించారు.
హుజూరాబాద్ మాదిరిగానే మునుగోడులో..
హుజూరాబాద్‌లో తనను ఓడించేందుకు కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేశారో అంతకంటే ఎక్కువ ప్రయత్నాలు చేశారని ఈటల పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్, ఆయన మంత్రుల మాయమాటలకు లొంగలేదని తెలిపారు. ఉద్యమాల చరిత్ర ఉన్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఓటర్లు కూడా చైతన్యవంతమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రజాకార్ల అహంకారాన్ని అణనిచివేసేందకు ఉద్యమించిన గడ్డ నల్లగొండ అన్నారు. మునుగోడు తీర్పు ద్వారా కేసీఆర్ అహంకారాన్ని అణచివేస్తారని తెలిపారు. డబ్బులతో గెలిచేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆరోపించారు.
అయ్య బెదిరింపులు.. కొడుకు తాయిలాలు..
తెలంగాణలో పరిస్థితి ఎలా తయారైందంటే.. కేసీఆర్ మునుగోడులో ఎలాగైనా గెలవాలని అధికారులకు చివరకు లంచాలు కూడా ఎర చూపారని ఈటల ఆరోపించారు. లంచాలకు లొంగని అధికారులను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ తనయుడు కేటీఆర్ హైదరాబాద్‌లో ఉన్న మునుగోడు ఓటర్లు 30 వేల మందికి తాయిలాలు ఎర వేశారని ఆరోపించారు. ఎల్‌బీ నగర్‌లో ఉన్న 30 వేల మంది మునుగోడు ఓటర్ల కోసం ఆగమేగాల మీద ఇళ్ల క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 2014 నుంచి పాలనపై గానీ, అవినీతిపైగానీ, ఆస్తులపైగానీ దమ్ముంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

ఆత్మగౌరవం చాటిన ఓటర్లు
మునుగోడు ఓటర్లు తమ ఓటు ద్వారా ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. ధర్మాన్ని కాపాడుతారని, డబ్బులకు ఓటు అమ్ముకోలేదని పేర్కొన్నారు. తన కేబినెట్ మొత్తాన్ని మునుగోడులో మోహరించినా, రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి మునుగోడులో గెలవాలని చూసినా, ప్రజలు కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారని తెలిపారు. రేపటి ఫలితాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.