KCR – RSS: పత్రికా స్వేచ్ఛ అంటే.. ఏది పడితే అది రాయడం.. నచ్చని వాళ్ళ మీద టన్నుల కొద్దీ బురద చల్లడం కాదు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం.. వాటి పరిష్కార బాధ్యతను ప్రభుత్వం ముందు ఉంచడం.. తెలుగు నాట ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అనే సమాధానం మీ నుంచి రావచ్చు. అది కూడా నిజమే. కాకపోతే ఇప్పుడు మీడియా రాజకీయ పార్టీల భజనలు మరో స్థాయికి తీసుకెళ్లింది. భజన అంటే అది మామూలు భజన కాదు.. గిట్టని పార్టీల మీద ఎంతగనం బురద చల్లుతోంది అంటే.. కనీసం ఏం రాస్తున్నామో సోయి కూడా పత్రికలకు ఉండటం లేదు. ఒక ఉద్యమ పత్రికగా ప్రారంభమైన నమస్తే తెలంగాణ.. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత అది కేసీఆర్ పంచన చేరిపోయింది. గులాబీ రంగును మరింత దట్టంగా అలముకుంది. ఈ దట్టంగా అలముకునే క్రమంలో అది అడ్డగోలుగా రాతలు రాస్తున్నది.
నమస్తే అంటేనే గులాబీ.. గులాబీ అంటేనే నమస్తే కాబట్టి.. దాని బాస్ చంద్రశేఖర రావు కాబట్టి.. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి.. ఏది రాసినా, గిట్టని వారిపై పేజీల కొద్దీ వార్తలు కుమ్మేసినా ఏమీ కాదు అనుకుంటే పొరబాటే. ఇటీవల మణిపూర్లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి.. నమస్తే తెలంగాణ “మణిపూర్ హింస వెనక ఆర్ఎస్ఎస్” అనే ఒక శీర్షికతో జూన్ రెండవ తేదీన ఒక బ్యానర్ వార్త కథనాన్ని కుమ్మేసింది. వాస్తవానికి ఈ కథనం పి టి ఐ నుంచి వస్తుంది కాబట్టి సెంట్రల్ డెస్క్ లో బాధ్యులే ఈ కథనాన్ని రాస్తారు. కానీ వారు ఈ మధ్య గులాబీ కార్యకర్తలను మించిపోయారు కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో మరింత మసాలా దట్టించి రాశారు. తిగుళ్ళ కృష్ణమూర్తి ఎడిటర్ అయిన తర్వాత అడ్డగోలు వార్తలు రాయడంలో.. అది కూడా కాంగ్రెస్, బిజెపి మీద రాయడంలో నమస్తే ఆరి తేరిపోయింది. అలా మణిపూర్ అల్లర్ల విషయంలో పిచ్చిపిచ్చిగా వార్తలు రాసింది.
దీంతో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. నాగ్ పూర్ బాధ్యులు నమస్తే తెలంగాణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మణిపూర్ అల్లర్ల వెనుక ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఎక్కడ ఉందో చెప్పాలి అని నోటీసులు పంపారు. సరైన సమాధానం చెప్పకుంటే తదుపరి చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. తెలంగాణలో ఉన్నట్టు కాదు కాబట్టి.. నమస్తే తెలంగాణకు అసలు నిజం అర్థమైంది. అందుకే క్షమాపణ చెప్పింది. మన్నించమని వేడుకుంది. రాజకీయ పార్టీలు ఇవాళ అధికారంలో ఉండవచ్చు గాక.. రేపటి నాడు ప్రతిపక్షంలో కూడా ఉండాల్సి ఉంటుంది. ఈమాత్రం దానికి పార్టీల భజన చేసే జర్నలిస్టులు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్తలు రాస్తే ఇలా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉండదు.