దేశంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బీజేపీ సర్కారు రెండు సార్లు అధికారం చేపట్టింది. హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే.. ఈసారి ఎలాగైనా ఓడించాలని విపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. ఇందుకోసం విభేదాలన్నీ పక్కనపెట్టి కలిసి కట్టుగా పనిచేయాలని భావిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా నేతృత్వంలో 19 విపక్షపార్టీలు సమావేశమయ్యాయి. అయితే.. ఈ భేటీలో మాత్రం టీఆర్ఎస్, వైసీపీ పాల్గొనలేదు.
ప్రధానంగా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, తృణమూల్, ఎన్సీపీ వంటి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లోనూ తమ ఐక్యతను చాటుకున్నాయి. పెగాసస్, వ్యవసాయ చట్టాలు ఇతరత్రా అంశాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టడంలో విపక్షాలు పైచేయి సాధించాయి. ఈ విధంగా కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఆ మధ్య రాహుల్ గాంధీ 14 పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, మోడీ సర్కారును ఎదుర్కోవాల్సిన వ్యూహంపై చర్చించారు. అప్పుడు కూడా వైసీపీ, టీఆర్ ఎస్ హాజరు కాలేదు. ఇప్పుడు తాజాగా సోనియా ఏర్పాటు చేసిన సమావేశంలోనూ పాల్గొనకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల తీరుపై జాతీయంగా చర్చ సాగుతోంది.
అయితే ఇక్కడ చర్చ.. వైసీపీ, టీఆర్ ఎస్ ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరాలని కాదు. ఎవరి విధానం వారికి ఉంటుంది. ఎవరు ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు. కానీ.. ఎవరికి మద్దతు ఇస్తున్నారో చెప్పకపోవడమే ఇక్కడ సమస్య. ఎవరికి పక్షాన ఉంటున్నారు? అన్నది తేల్చకపోవడమే చర్చ. అటు జగన్, ఇటు కేసీఆర్ గోడమీది పిల్లివాటంలా వ్యవహరిస్తున్నారని జాతీయ నేతలు అంటున్నారట. అందుకే.. ఈ రెండు పార్టీలను పట్టించుకోవట్లేదనే విశ్లేషణలు వస్తున్నాయి.
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ ఎస్ అన్నట్టుగా ఉంది. కానీ.. కేంద్రంలోకి వెళ్లే సరికి గులాబీ పార్టీ కమలానికి మద్దతు ఇస్తోంది అన్నట్టుగానే ఉంది పరిస్థితి. అటు జగన్ పార్టీ కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తోంది. పార్లమెంటులో అంశాల వారీగా అవసరమైనప్పుడల్లా తామున్నామంటూ మద్దతు తెలుపుతున్నాయి. బిల్లులు గట్టెక్కిస్తున్నాయి. మరి, ఇదే విషయం బయటకు చెబుతున్నాయా? అంటే అది లేదు. కేంద్రంలో దోస్తీ కడుతూ.. రాష్ట్రానికొచ్చి సైలెంట్ గా ఉంటున్నాయనే అపవాదు ఉంది.
ఇందులో టీఆర్ ఎస్ ఓ అడుగు ముందుకేసి రాజకీయం చేస్తోందని అంటున్నారు. రాహుల్, సోనియా మీటింగ్ కు హాజరు కాలేదుగానీ.. మధ్యలో కపిల్ సిబల్ ఏర్పాటు చేసిన సమావేశానికి మాత్రం వెళ్లొచ్చారు. ఈ విధంగా.. తాము ఎటు ఉన్నామో చెప్పకుండా రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే.. తమ కేసులు, ఇతర విషయాల్లో ఇబ్బంది తప్పదనే భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. ఇలాంటి రాజకీయం ఎల్లకాలం మంచిది కాదని, రివర్స్ తగిలే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.