Telangana New Cm Oath: తెలంగాణ నూతన సీఎంగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులతోపాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబులను ఆహ్వానించారు.
ఢిల్లీ అధినేతలకు స్వయంగా ఆహ్వానం..
ఇదిలా ఉండగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని స్వయంగా ఆహ్వానించారు. సీనియర్ నేతలు చిదంబరం, అశోక్ గహ్లోత్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, మీరాకుమార్, కుంతియా, భూపేష్ బఘేల్, అశోక్ చవాన్, వాయలార్ రవి, సుశీల్‌కుమార్ శిందే, మాణికం ఠాగూర్, కురియన్లను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.
అమర వీరుల కుటుంబాలకు..
కాంగ్రెస్ అగ్రనేతలు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యతోపాటు వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు. ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానాలు పంపారు.
సోనియా హాజరయ్యే ఛాన్స్..
రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో ఆమెను మీడియా ప్రతినిధులు తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తారా అని అడగగా, అవకాశం ఉందని సమాధానం చెప్పారు.