
Kavitha- ED: ఢిల్లీ లిక్కర్ స్కాంకు నేతృత్వం వహించినట్లుగా ఈడీ చెబుతున్న భారత రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వరుసగా రెండో రోజు ప్రశ్నిస్తోంది. తాజా విచారణతో కవిత మూడుసార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. అనుమానితురాలిగానే కవితను ఆవిచారణ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. కానీ అనుమానితురాలిని గంటల కొద్దీ విచారణ చేయడం అనుమానాలకు తావిస్తోంది. బీఆర్‌ఎస్ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం తెలియని ఆందోళన కనిపిస్తోంది. వరుస విచారణతో ఈడీ కూడా అప్రమత్తమయ్యారు. భారీగా డబ్బులు వెచ్చించి పెట్టుకున్న న్యాయవాదుల సలహా మేరకు ఈడీపై ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు.
ఎవిడెన్స్‌తో ఎటాక్..
ఈడీ విచారణపై కవిత ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ వేశారు. అలా కుదరకుంటే తన ఇంట్లో లేదా, వీడియోకాన్ఫరెన్‌స ద్వారా విచారణ చేయాలని కోరారు. మహిళను కాబట్టి కొన్ని సడలింపులు ఇవ్వాలని విన్నవించారు. అయితే ఈ పిటిషన్‌పై ఈనెల 24 విచారణ జరుగనుంది. అయితే ఈడీ మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈనెల 24వ తేదీలోపే కవితతో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కవిత కూడా ఈడీతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించాలని చూస్తున్నారు. ఈమేరకు న్యాయనిపుణులతో చర్చించి ఈడీ అధికారులను కవిత ఆధారాలు చూపుతూ టార్గెట్ చేయాలని చూస్తున్నారు.
థర్డ్ డిగ్రీ అంటూ ఆరోపణ..
ఈడీ అధికారులు విచారణలో భాగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని, గతంలో ఒకరిపై ప్రయోగించారని ఉదహరించారు. అందుకే తనను తన ఇంటిలో లేదా వీడియోకాన్షరెన్స్ ద్వారా విచారణ చేసేలా ఆదేశించాలని కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహిళలను రాత్రి వరకు విచారణ చేయొద్దని చట్టం ఉన్నా.. ఈడీ తనను రాత్రి 8 గంటల వరకు విచారణ చేసిందని తెలిపారు.
తాజాగా ఫోన్ల ప్రదర్శన..
ఇక తాజాగా విచారణకు ఫోన్లు తీసుకురావాలని కవితను ఈడీ అధికారులు ఆదేశించారు. ఈమేరకు మంగళవారం కవిత ఈడీ చెప్పిన ఈఎంఐ నంబర్ల ఫోన్లను తీసుకుని విచారణకు బయల్దేరారు. ఈ క్రమంలో ఈడీ అధికారులను ఇరుకున పెట్టేలా ఇంటి నుంచి బయటకు వచ్చాకా ఫోన్లను ప్రదర్శించారు. ఏమీ మాట్లాడకుండా అవి తాను సమర్పించాలనుకుంటున్న సాక్ష్యాలని పేర్కొంది. పది ఫోన్లను ధ్వంసం చేసిందని ఈడీ కవితపై ఆరోపణ చేసింది. కానీ, కవిత ఈడీ ఆరోపణలు తప్పని, ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేశారు.

జుడ్యీషియల్ అధికారాలు ఉన్న ఈడీతో న్యాయ నిపుణుల సలహాలు సూచనలతో కవిత గేమ్ మెదలు పెట్టారు. మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుంది. ఈడీవద్ద స్కాంకు సంబంధించి కవిత ఇన్‌వాల్వ్‌మెంట్‌పై ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, వాటిఆధారంగా ఈడీ కవితను జైలుకు పంపుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.