Butta Bomma Trailer Review: ఒక ప్రక్క స్టార్ హీరోలతో భారీ చిత్రాలు నిర్మిస్తూనే కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను నిర్మాత నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. యంగ్ టాలెంట్ ని ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన డీజే టిల్లు, స్వాతి ముత్యం మంచి విజయాలు సాధించాయి. డీజే టిల్లు అయితే భారీ లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ బ్యానర్ లో బుట్టబొమ్మ టైటిల్ తో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట జంటగా నటిస్తున్నారు. ఖైదీ, మాస్టర్ ఫేమ్ అర్జున్ దాస్ మరో ప్రధాన రోల్ చేశారు. సీరియల్ నటి నవ్య స్వామి మరో పాత్రలో నటించారు.

బుట్టబొమ్మ చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేశారు. రెండు అమాయకపు మనసుల మధ్య స్వచ్ఛమైన ప్రేమ చిగురిస్తుంది. సంతోషంగా సాగుతున్న వారి ప్రేమకథలోకి ఊహించని విలన్ అడుగుపెడతాడు. దాంతో వారి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. నెగిటివ్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అర్జున్ దాస్ మరోసారి బుట్టబొమ్మ మూవీతో తన విలనీ పవర్ చూపించాడని తెలుస్తుంది. అసలు ప్రేమ జంట జోలికి అతడు ఎందుకు వెళ్ళాడు? అతనికి కావాల్సింది ఏమీటీ? అనిఖా, సూర్య వశిష్ట లను అతడు ఎందుకు వెంటాడుతున్నాడనేది? ఆసక్తికర విషయం.
యూత్ ని మెప్పించే ఆసక్తికర అంశాలు బుట్టబొమ్మ చిత్రంలో ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ ట్రెండ్ నడుస్తుండగా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీతో మేకర్స్ వస్తున్నారు. కాన్సెప్ట్ కనెక్ట్ అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో భారీ హిట్ పడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ బీజీఎం మెప్పించింది. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన బుట్టబొమ్మ ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది.

ఫిబ్రవరి 4న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ దర్శకుడిగా ఉన్నాడు. మూవీ విజయంపై మేకర్స్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. చిన్న సినిమా విడుదలై పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. బుట్టబొమ్మ చిత్రానికి పోటీగా మైఖేల్ విడుదలవుతుంది. సందీప్ కిషన్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో మైఖేల్ విడుదల చేస్తున్నారు. ఇవి రెండూ భిన్న జోనర్స్ కావడంతో పోటీ ఉండదని చెప్పొచ్చు.