
Kavith vs ED : ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కవితను చుట్టు ముడుతోంది. ఇన్నాళ్లూ దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాట్లాడలేదు. తొలిసారిగా కవిత సోదరుడు కేటీఆర్ హైదరాబాద్‌లో స్పందించారు. మరోవైపు మహిళల కోసం ఉద్యమిస్తానని ఢిల్లీ వెళ్లిన కవిత కూడా ఇదే స్కాంలో తన పాత్రపై, ఈడీ నోటీసులపై మాట్లాడారు. ఒకేరోజు అన్నా చెల్లెలు మోదీని అటాక్ చేశారు. ఒకరు ఢిల్లీలో మాట్లాడితే… మరోకరు హైదరాబాద్‌లో మాట్లాడారు. అయితే ఈ ప్రెస్‌మీట్ సమయంలో ఇద్దరి మోములో ఏదో తెలియని ఆందోళన మాత్రం స్పష్టంగా కనిపించింది. ఏదో జరగబోతోంది అన్న విషయం అందరికీ అర్థమైంది.
హైదాబాద్‌లో కేటీఆర్..
కవిత లిక్కర్ స్కాంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ బవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని.. బీజేపీ రాజకీయ కక్ష సాధింపును ప్రజాకోర్టులో ఎదుర్కొంటామని తెలిపారు. బీజేపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, బీజేపీ వైఖరిపై మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్సీ కవిత చట్టాన్ని గౌరవిస్తారని.. ఈడీ విచారణను సమర్థంగా ఎదుర్కొంటారని చెప్పారు. మోదీకి పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ బినామీ అని ఆరోపించారు. ఈ ఆరోపణలపై లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? అని కేటీఆర్ సవాల్ విసిరారు. తొమ్మిదేళ్ల పాలనలో బీజేపీ 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 12 మంది నాయకులపైకి సీబీఐ, ఈడీని పంపించారు అని తెలిపారు.
ఢిల్లీలో కవిత..
ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టిన కవిత కూడా బీజేపీ, కేంద్ర, మోదీపైనే విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడి చేయిస్తోందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీలతో దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటాలు జరుగుతున్నాయని. ఎన్ని ప్రభుత్వాలు మారినా దానికి మాత్రం ఆమోదం లభించలేదన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ బిల్లు కోసం మా పోరాటం కొనసాగిస్తాం. 2014, 2019 ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై భాజపా హామీ ఇచ్చిందన్నారు. ప్రజలు 300కి పైగా స్థానాలు ఆ పార్టీకి ఇచ్చినా బిల్లును ఆమోదించలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలతో బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానమన్నారు. ఎన్నికల నేపథ్యంలో మా పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేయడమే ఆ పార్టీ లక్ష్యం అని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, న్యాయం తమవైపు ఉన్నాయని తెలిపారు. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు.
ఇద్దరిలోనూ తెలియని ఆందోళన..
ఇటు హైదరాబాద్‌లో, అటు ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టిన అన్నా చెల్లెలు కేటీఆర్, కవితలో ఏదో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. కేటీఆర్ మోములో తొలిసారి టెన్షన్ చూశామని ప్రెస్‌మీట్‌కు వెళ్లిన ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కేటీఆర్‌కు ప్రెస్‌మీట్‌లో చెమటలు రావడం మొదటిసారి చూశామని అంటున్నారు. ఇక కవిత గొంతులో అయితే వణుకే కనిపించింది. మీడియా ముందు ప్రతీ దానికి లేని నవ్వు ముఖంపైకి తెప్పించుకున్నారు కవిత. అంతర్గత ఆందోళన ముఖంలో కనిపించకుండా కవర్ చేయాలని చూశారు. కానీ లోపలి భయం మాటలో వణుకు రూపంలో బయటకు వచ్చింది. మొత్తంగా ఏదో జరగబోతోంది అన్న ఆందోళన మాత్రం అన్నా చెల్లెలులో కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇద్దరూ విపక్షాలను మాత్రమే కేంద్రం, మోదీ టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇది నిజమే అనుకుందాం. మరి తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలు బీఆర్‌ఎస్ నేతల భూ కబ్జాలు, మైనింగ్ దందాలు, ఇసుక దందాలు, దాడులు, అవినీతి, అక్రమాలు ఇలా అనేక అంశాలపై తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మని తొమ్మిదేళ్లలో ఒక్క బీఆర్‌ఎస్ నేతపై పోలీసులు కేసు పెట్ట లేదు. కనీసం దందా ఆపే ప్రయత్నం చేయలేదు. కవిత, కేటీఆర్ ఒక్కో వేలు మోదీవైపు చూపుతూ మిగతా నాలుగు వేళ్లు తమవైపు ఉన్నాయన్న విషయం మర్చిపోవడం గమనార్హం.