TVK Vijay Karur stampede : కరూర్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట తర్వాత టీవీ కె పార్టీ అధినేత విజయ్ తీవ్రమైన ఒత్తిడి ఎదురుకున్నారు. అధికార డిఎంకె రకరకాలుగా విమర్శలు చేయడంతో ఆయన కొద్ది రోజులపాటు ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ సుప్రీంకోర్టు దాకా వెళ్లడం.. డీఎంకే పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పట్ల అనుమానాలు వ్యక్త చేయడంతో.. సుప్రీంకోర్టు కల్పించుకుంది. ఈ కేసును విచారించే బాధ్యతను సిబిఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. దీంతో డిఎంకె కు షాక్ తగిలింది.
డీఎంకేకు ఇప్పుడు విజయ్ మరో షాక్ ఇచ్చారు. కరూర్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 41 చనిపోయిన నేపథ్యంలో.. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత బాధిత కుటుంబాలను టీవీ కే పార్టీ అధినేత విజయ్ కలిశారు. మహాబలిపురం ప్రాంతంలోని ఓ రిసార్ట్ లో 50 గదులను బుక్ చేశారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలను ప్రత్యేక బస్సులలో అక్కడికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులతో విజయ్ ప్రత్యేకంగా మాట్లాడారు. వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. స్వయంగా వారు చెబుతున్న వివరాలను విజయ్ నోట్ చేసుకున్నారు. విజయ్ వెంట పార్టీ ప్రధాన కార్యదర్శులు బుస్సీ ఆనంద్ కుమార్, అర్జున్ ఉన్నారు. పార్టీపరంగా అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. పిల్లల చదువులు.. వైద్య ఖర్చులు.. ఇతర విషయాలలో కూడా పార్టీ మీకు సపోర్ట్ గా ఉంటుందని వారికి భరోసా కల్పించారు.
41 మంది కుటుంబాలతో కలిసి విజయ్ భోజనం కూడా చేశారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని విజయ్ వారితో వాపోయారు. ప్రజల కోసమే తాను పార్టీ పెట్టానని.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేశానని.. ప్రజల భద్రత తన మొదటి ప్రాధాన్యత అని విజయ్ పేర్కొన్నారు. అయితే అనూహ్యంగా జరిగిన ఈ సంఘటన తనను ఎంతో బాధించిందని బాధిత కుటుంబాలతో విజయ్ వాపోయారు. ఈ సందర్భంగా విజయ్ కన్నీటి పర్యంతమయ్యారు.”నాకు తీవ్రమైన దుఃఖం కలుగుతున్నది. తీవ్ర ఆవేదనలో నేను కనిపిస్తున్న. గడిచిన నెల రోజుల నుంచి నేను మానసికంగా సిద్ధంగా లేను. మిమ్మల్ని కలుసుకునే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నాకు అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే మిమ్మల్ని ఇక్కడిదాక తీసుకొచ్చాను. నాకు ఇంతకుమించి వేరే ప్రత్యామ్నాయం లేదు. అందువల్లే మీతో ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మాట్లాడాల్సి వస్తోంది. మీకు కన్నీటిని తుడిచే సామర్థ్యం లేకపోవచ్చు గాని.. భరోసా కల్పించే ధైర్యం మాత్రం ఉందని” విజయ్ వారితో పేర్కొన్నాడు.
కరూర్ ఘటన జరిగిన తర్వాత మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని విజయ్ ప్రకటించాడు. త్వరలోనే ఆ కుటుంబాలకు చెక్కులు ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ ఘటనపై ప్రస్తుతం సిబిఐ విచారణ మొదలైంది. ఇప్పటికే ఈ విషయంపై అటు డీఎంకే.. ఇటు టీవీకే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.