PM Modi – CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబుకు( AP CM Chandrababu) ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఏపీలో ఉన్న పరిస్థితులపై ఆరా తీశారు. ఏపీకి తుఫాను ముప్పు వెంటాడుతున్న నేపథ్యంలో సర్వత్ర ఆందోళన నెలకొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చి వాయుగుండం గా మారింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తుంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. రేపు ఉదయానికి మరింత తీవ్రతరం కానుంది. రేపు రాత్రికి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. వస్తూ వస్తూ తుఫాన్ పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయనన్నాయి. అందుకే భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో తుఫాను సహాయక చర్యలు, సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబును ఆరా తీశారు.
* సీఎం కీలక ఆదేశాలు..
ఇప్పటికే తుఫాను ముందస్తు చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. అన్ని జిల్లాల యంత్రాంగాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు కోటి రూపాయల చొప్పున విడుదల చేశారు. మరికొన్ని జిల్లాలకు 50 లక్షల రూపాయలు కేటాయించారు. ఎస్డిఆర్ఎఫ్ తో పాటు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను సైతం సిద్ధంగా ఉంచారు. తుఫాను సృష్టించే నష్ట తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ఆదేశించారు. సమాచార వ్యవస్థ నిలిచిపోకుండా ఉండేందుకు సెల్ టవర్ల వద్ద డీజిల్ జనరేటర్ లను అందుబాటులో తేవాలని ఆదేశించారు. మరోవైపు విద్యుత్ శాఖను మరింత సన్నద్ధం చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లతో పాటు స్తంభాలను అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సహాయక చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబు పూర్తిస్థాయిలో వివరించారు.
* గత అనుభవాల దృష్ట్యా..
గత అనుభవాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) సూచించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఏపీకి తాము అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సహాయ చర్యల గురించి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధంగా ఉండగా.. ఇప్పుడు కేంద్రం సైతం సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రభావిత జిల్లాలకు మరిన్ని నిధులు కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు తుఫాన్ దృష్ట్యా ఇన్చార్జ్ మంత్రులతో పాటు జిల్లా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అతి ప్రభావిత మండలాల్లో సైతం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. అయితే కేంద్రం ముందస్తుగానే అప్రమత్తం కావడం.. రాష్ట్రానికి కీలక సూచనలు చేయడం విశేషం.