Karnataka Transport Minister: చిల్లర.. ఇది లేకపోవడమే ఆ మంత్రికి శాపమైంది. ఆయన మంత్రి అయినప్పటికీ.. బస్సు దిగిపోవాల్సి వచ్చింది.. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మంత్రి అయి ఉండి.. అది కూడా చిల్లర లేకపోవడంతో బస్సు దిగడం చర్చకు దారి తీసింది.. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ఉంది. ఆ మంత్రి ఒకే ఒక్కడు సినిమా మాదిరిగా..ఏదో చేద్దామనుకున్నారు. కానీ ఉద్యోగులలో ఉన్న నిర్లక్ష్యం ఆయనకు మరో సినిమా చూపించింది.
కర్ణాటక రాష్ట్రంలో బయరతి సురేష్ రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన బెంగళూరులో ఆర్టీసీ బస్సుల సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తనను ఎవరు గుర్తించకుండా ఉండడానికి మాస్కు ధరించారు. సాధారణ ప్రయాణికులు మాదిరిగా నగరంలో అనేక బస్సులలో ఆయన ప్రయాణించారు. రవాణా సేవలను దగ్గరుండి చూశారు.
ఆయన తనిఖీలో భాగంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. తనిఖీలలో భాగంగా మంత్రి బస్సు ఎక్కారు. వంద రూపాయలు ఇచ్చి రెండు టికెట్లు ఇవ్వాలని కోరారు.. కండక్టర్ మాత్రం తన దగ్గర చిల్లర లేదని.. బ్యాగ్ చూపించారు. అంతేకాదు చిల్లర లేకపోతే బస్సు దిగి వెళ్లిపోవాలని గట్టిగా హెచ్చరించారు. మరోవైపు ఒక స్టాప్ వద్ద బస్సు ఆపాలని ఒక ప్రయాణికుడు చేయి ఎత్తినప్పటికీ.. బస్సు డ్రైవర్ ఆపలేదు.
ఇలా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మంత్రికి కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆర్టీసీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు చిల్లర లేవని కండక్టర్ చెప్పడంతో.. ఆయన అక్కడికక్కడే బస్సు దిగి వెళ్ళిపోయారు. కాగా ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఇటీవల కాలంలో ఆర్టీసీ ఉద్యోగుల మీద ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. నేరుగా రవాణా శాఖ మంత్రి రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. చివరికి ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని దగ్గరుండి చూసి.. ఆశ్చర్యపోయారు. నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
