
Karnataka Elections 2023: కర్ణాటకలో అధికార బీజేపీ సహా అన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలను ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లను తమవైపు తిప్పుకొనేందుకు అన్ని పార్టీలు తలమునకలవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 7.7 లక్షల ఆటోలు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో 6 లక్షల ఆటోలు సేవలందిస్తున్నాయి. ఒక్కొక్క ఆటో డ్రైవర్ కుటుంబంలోనూ నాలుగేసి ఓట్లు వేసుకున్నా దాదాపు 25 లక్షల వరకు ఓట్లు ఉంటాయని పార్టీలు భావిస్తున్నాయి. ఇక, ఆటో డ్రైవర్లు ఏ పార్టీవైపు మొగ్గితే.. వారు తమ ఆటోల్లో ప్రయాణించేవారికి ఆ పార్టీపట్ల సానుకూలత పెరిగేలా మౌఖిక ప్రచారం చేస్తారని.. తద్వారా ఇది తమకు మరింత లాభిస్తుందని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీల కీలక నేతలూ.. ‘ఆటో వాలా జిందాబాద్!’ నినాదాలు చేస్తున్నారు.
నిజానికి గత ఎన్నికల సమయంలో ఆటో వాలాలను ఏ పార్టీ కూడా లెక్కలోకి తీసుకోలేదు. వారిని కేవలం ప్రచార సామగ్రి రవాణా చేసేందుకు, మైకులు కట్టి ప్రచారం చేసుకునేందుకు వినియోగించుకున్నాయి. కానీ, ఇప్పుడు పోటీ పెరిగిన నేపథ్యంలో ప్రతి ఓటూ ముఖ్యమని భావిస్తుండడంతో ఆటో వాలాల జపం పెరిగింది. ఇక, ఆటో రిక్షా రంగంలోని మెకానిక్‌లు, పేయింటర్లు, ఇతర కార్మికులను కలుపుకొంటే.. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అందుకే.. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఆటోవాలాలను మచ్చిక చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

జేడీఎస్
ప్రతిపక్ష జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి తాము అధికారంలోకి వస్తే ఆటో వాలాలకు నెలనెలా రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. అంతేకాదు.. ఆటో డ్రైవర్లకు సమస్యలు పెరిగిపోయాయని, పోలీసు, రవాణా శాఖ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని, ఇంధన ధరలు పెరిగాయని తాము అధికారంలోకి వస్తే.. వేధింపులు లేకుండా చేసి.. ధరలు తగ్గిస్తామని హామీల వర్షం కురిపించారు.
బీజేపీ
అధికార బీజేపీ నేతలు.. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆటో రిక్షా కార్మిక కుటుంబాలకు ప్రకటించిన హామీలను గుర్తు చేస్తున్నారు. ఆటో వాలాల పిల్లలకు ‘రైతా విద్యానిధి’ పథకాన్ని ప్రకటించామని.. ఇది అమలు కావాలంటే తమకే ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.
కాంగ్రెస్
మరో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ‘మీరు.. మేమూ ఒకటే’ అంటూ.. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆటోవాలాలకు చేరువవుతున్నారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన సమావేశంలో ఖాకీ చొక్కా ధరించి, ఆటో నడుపుతూ.. డ్రైవర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ‘సాధారణ ప్రజల రథసారథులు’ అంటూ డ్రైవర్లను ఆకాశానికి ఎత్తేశారు. ‘‘మీరు.. కులం, మతం చూడని అభినవ లౌకిక వాదులు’’ అని వ్యాఖ్యానించారు.
బైక్ ట్యాక్సీలు రద్దు చేయాలి
రాజకీయ పార్టీలు తమపై దృష్టి పెట్టడాన్ని కర్ణాటక ఆటో రిక్షా డ్రైవర్స్ ఫెడరేషన్ స్వాగతించింది.. తమ కుటుంబాల్లోని ఓట్లు, ఇతర విభాగాల్లోని కార్మికుల ఓట్లు లక్షల సంఖ్యలో ఉన్నాయని ఆ సంఘం నాయకులు చెబుతున్నారు. అయితే.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేసమయంలో బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలని, ఈ హామీలు ఇచ్చే పార్టీల వెంట తాము నడుస్తామని చెప్పారు.