Karnataka Elections 2023: 2019 ఎన్నికల్లో మోదీ ఓడిపోతాడు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి మళ్ళీ రాదు అని చాలామంది అన్నారు. కానీ ఆ వ్యాఖ్యలను తుత్తునియలు చేస్తూ నరేంద్ర మోదీ కనివిని ఎరుగని స్థాయిలో మెజారిటీ సాధించి రెండవసారి అధికారంలోకి వచ్చాడు. అప్పుడు పని చేసింది మోదీ మ్యాజిక్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు కూడా మోదీ మ్యాజిక్ ప్రస్తావనకు వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో బుధవారం ఎన్నికలు జరగబోతున్నాయి. తన తీరుకు విభిన్నంగా నరేంద్ర మోదీ 24 చోట్ల ప్రచారం చేశారు. గుళ్ళు, గోపురాలు, మఠాలు తిరిగారు. చివరికి తనకు ఉన్న అన్ని అస్త్రాలు వాడారు.
కాలం చెల్లుతుంది
కర్ణాటకలో ఈసారి భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి రాకుంటే నరేంద్ర మోదీ మ్యాజిక్ కు కాలం చెల్లినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని అన్ని తానై వ్యవహరించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా ప్రకటించలేదు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రిని అధికారంలోకి వస్తే మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని హామీ కూడా ఇవ్వలేదు. బసవరాజ్ బొమ్మై కూడా మళ్లీ నేనే ముఖ్యమంత్రిని అవుతానని కూడా ప్రకటించుకోలేదు. అధిష్టానం మళ్ళీ తనకు అవకాశం ఇస్తుందనే ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేయలేదు.. ప్రచారంలోనూ ఆయన ఆచితూచి మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే బసవరాజ్ బొమ్మై భారతీయ జనతా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించారు. ఆయనే కాదు చాలామంది నాయకుల పరిస్థితి చూసి అలాగే ఉంది. ఒకప్పుడు కర్ణాటకలో యడ్యూరప్ప భారతీయ జనతా పార్టీ భారం మొత్తం మోసేవారు. ఆయన పార్టీని వీడిన తర్వాత పరిస్థితి ఒక్కసారి గా మారిపోయింది. స్థానిక నాయకత్వం పక్కకు పోయి కేవలం నరేంద్ర మోదీ మ్యాజిక్ తెరపైకి వచ్చింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఇది జోరుగా కొనసాగింది.. కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతే అది కూడా మోదీ మ్యాజిక్ మీదే జరగబోతోంది అని నేషనల్ మీడియా కోడై కూస్తోంది.
సర్వత్రా ఆసక్తి
ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కేవలం నరేంద్ర మోదీ మ్యాజిక్ మీద ఆశలతోనే పనిచేసింది. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పకుండా మోదీ ని చూసి ఓటేయమని అభ్యర్థించింది. అయితే నిన్నటిదాకా జరిగిన కర్ణాటక ప్రచారంలోనూ అదే సంప్రదాయం కొనసాగింది. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత ఏడాదిలోపు లోక్ సభ ఎన్నికలు వస్తాయి. అలాంటప్పుడు మోదీ మ్యాజిక్ అనే అంశం మళ్లీ తెరపైకి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మోదీ మ్యాజిక్ తెరపైకి రావడానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీనే. ఎందుకంటే చాలాచోట్ల బలమైన నేతలు ఉన్న భారతీయ జనతా పార్టీలో వారందరినీ వెనక్కి పంపించి.. మరో ప్రత్యామ్నాయం అనే ఆలోచన లేకుండా నరేంద్ర మోదీ తెరపైకి వచ్చారు. మరి దేశ ప్రజల్లో ప్రధానమంత్రి మాటల పట్ల ఉన్న ఆదరణ ఎంత అనే అంశంపై కన్నడిగులు ఇచ్చే తీర్పు ఒక నమూనా కానుంది.
దక్షిణాది రాష్ట్రమే
కర్ణాటకలో బిజెపి వాళ్లు ఎంత ఉత్తర ప్రదేశ్ గా మార్చినప్పటికీ అది దక్షిణాది రాష్ట్రమే. కర్ణాటక రాష్ట్రం దేశ ఐటీ రాజధానిగా కొనసాగుతోంది. దేశ జీడీపీలో 30% వాటా కలిగి ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో రెండవ స్థానంలో కొనసాగుతోంది.. కానీ ఇంతటి చరిష్మా ఉన్న రాష్ట్రంలో హిజాబ్ వంటి గొడవలు ఒకింత ఆందోళన కలిగించాయి. మరి తొమ్మిది సంవత్సరాల అనంతరం మూడవసారి లోక్ సభ ఎన్నికలను మోదీ ఎదుర్కోవాల్సిన తరంలో ఇప్పుడు ఆయన మ్యాజిక్ పనిచేస్తే 2024లో కూడా కేంద్రంలో బిజెపి తీర్పులేని రీతిలో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ఒకవేళ కర్ణాటకలో ఓడిపోతే అది కాస్త ఆలోచించాల్సిన అంశం అవుతుంది.