Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా పయనిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే బిజెపి రెండు అంకెల సీట్లు దాటే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు జెడిఎస్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ లో 25 నుంచి 35 సీట్లు వస్తాయని అంచనా వేయగా ప్రస్తుత పరిస్థితి చూస్తే 20 సీట్లు లోపే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప 115 పైగా సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆధిపత్య ధోరణే కొంప ముంచిందా..
కర్ణాటకలో ఓట్ల లెక్కింపు ఫలితాల సరళి చూస్తుంటే బిజెపి ఓటమి ఖాయంగా తెలుస్తుంది. ఆ పార్టీ పై ఉన్న అవినీతి ఆరోపణలు.. మరోవైపు ఢిల్లీ పెద్దలు ఆరోపణలను అధిగమించేలా ఆధిపత్యం చెలాయించడం ఆ పార్టీని ఓటమి వైపు నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి మొదలు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. తాము కాకపోతే ఎవరూ కాదు అన్నట్లుగా వ్యవహరించారు. ప్రధాని మోదీ అయితే ఒక్కో రోజు 15 నుంచి 20 నియోజకవర్గాల్లో రోడ్ షోలు చేశారు. ఓటర్లను అభ్యర్థించకుండా ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా బీజేపీ నేతల ప్రసంగాలు సాగాయి. మేం తప్ప ఎవరూ పాలించలేరు అన్నట్లుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఆధిపత్య ధోరణి కర్ణాటక ప్రజలు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. దాని ఫలితం కౌంటింగ్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
గట్టెక్కించని హనుమాన్..
తాము అధికారంలోకి వస్తే కర్ణాటకలో బజరంగ్ దల్ ను నిషేదిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో దీనిని ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని బిజెపి భావించింది. ప్రధానమంత్రి నుంచి మొదలు కిందిస్థాయి కార్యకర్తలకు అందరూ హనుమాన్ నామస్మరణ చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఎన్నికల ముందు రోజు కూడా హనుమాన్ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. బజరంగ్ దళ్ పై నిషేధం అంశం బిజెపికి కలిసి వస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ కర్ణాటక ఓటర్లు 30 ఏళ్ల సంప్రదాయానికి మొగ్గు చూపారు. అధికారులు ఉన్న పార్టీని 30 ఏళ్లుగా అక్కడి ప్రజలు ఓడిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఫలితాలు కూడా దానినే రుజువు చేస్తున్నాయి.