Vijayasai Reddy – YV Subba Reedy: విశాఖ కోసం విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి ఫైట్

విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి మధ్య వివాదం ముదిరితే మరో సంక్షోభానికి జగన్ సిద్ధంగా ఉండాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో? 

Written By: Dharma, Updated On : May 13, 2023 10:39 am
Follow us on

Vijayasai Reddy – YV Subba Reedy: వైసీపీలో నేతల ప్రాధాన్యతలు మారుతుంటాయి. అక్కడ అధినేత తరువాత స్థానాలు కుదురుగా ఉండవు. నేతలకు నిలకడగా ఉండదు. ఎదుగుతున్న క్రమంలో ఒదిగి ఉంటేనే అక్కడ స్థానం. లేకుంటే ఇట్టే మార్చేస్తుంటారు. అయితే ఈ విషయం తెలియని విజయసాయిరెడ్డి అతి చేశారు. అసలు విషయం తెలిసేసరికి ఇప్పుడు ఢిల్లీకే పరిమితమవుతున్నారు. విజయసాయిరెడ్డిని సైడ్ చేసి సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి జగన్ టాప్ ప్రయారిటీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మధ్యలో ఈ మధ్య ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని జగన్ తమ టీమ్ లో తీసుకున్నట్టు సంకేతాలు ఇచ్చాయి. అయితే ఇదంతా విజయసాయిరెడ్డిని పొమ్మన లేక పొగ పెట్టేందుకేనన్న టాక్ నడిచింది. కానీ బాలినేని ఖాళీ చేసిన స్థానాన్ని విజయసాయికి కట్టబెట్టడంతో ఆయన హవా తగ్గలేదని తేటతెల్లమైంది.

వారిద్దరికీ చెక్..
పులి ఒక అడుగు వెనక్కి వేస్తే అస్త్ర సన్యాసం చేసినట్టు కాదని విజయసాయిరెడ్డి చర్యలుంటున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పరిణామాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వాటి నుంచి బయటపడేయడంలో సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆశించిన స్థాయిలో పనిచేయలేదన్న ఫీడ్ బ్యాక్ జగన్ కు చేరినట్టు తెలిసింది. దీంతో విజయసాయిని వెనక్కి రప్పించి ఒక్కో బాధ్యతను తిరిగి కట్టబెడుతున్నారు. దీంతో విజయసాయిరెడ్డి తన మైండ్ కు పదునుపెట్టారు. తన దగ్గర ఉన్న పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలతో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డిలకు చెక్ చెప్పడం ప్రారంభించారు.

రివేంజ్ కు ప్లాన్..
ముఖ్యంగా వైవీ సుబ్బారెడ్డిపై పెద్ద ఫైట్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. తనకు ఇష్టమైన ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను తప్పించి వైవీకి ఇవ్వడమే అందుకు కారణం. జగన్ కు లేనిపోని పితూరీలు చెప్పి తనను అకారణంగా తప్పించారని విజయసాయి ఆగ్రహంగా ఉన్నారు. ఒకానొక దశలోఆయనను ఉత్తరాంధ్ర సీఎం అని చెప్పుకున్నారు. నడిచినంత కాలం నడిచింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. విజయసాయిరెడ్డి తోకలను జగన్ కత్తిరించారు. కానీ ఆయన మాత్రం విశాఖను వదిలి పెట్టేది లేదంటున్నారు. తన అవసరం అధినేతకు ఏర్పడడంతో అదే రేంజ్ లో రివేంజ్ కు ప్లాన్ చేస్తున్నారు. వైవీ రాగానే విజయసాయిరెడ్డి మనుషులకు సాగనంపారు. ఇప్పుడు పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా ఉన్న విజయసాయి వైవీ తొలగించిన వారిని పునర్నినియమిస్తున్నారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. జగన్ వద్దే తేల్చుకోవడానికి డిసైడయ్యారు.

బాలినేని పోయి..
వైవీ ధాటికి ఇప్పటికే బాలినేని ఇంటికెళ్లిపోయారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి కూడా అదే పరిస్థితి వస్తుందంటున్నారు. విజయసాయిరెడ్డి ఇప్పటికే  హైకమాండ్ విశ్వాసాన్నికోల్పోయారు. ఢిల్లీలోనే ఎక్కువ ఉంటున్నారు. బాలినేని వదిలేసిన ప్రాంతీయ కోఆర్డీనేటర్ పదవి విజయసాయికి కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ట్విట్టర్ లో విజయసాయి రిప్లయ్ ఇవ్వలేదు. అంటే ఇంకా డిఫెన్స్ లో ఉన్నారన్నమాట. దీంతో తెరవెనుక ఏదో జరుగుతుందన్న అనుమానం అందర్నీ వెంటాడుతోంది. విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి మధ్య వివాదం ముదిరితే మరో సంక్షోభానికి జగన్ సిద్ధంగా ఉండాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?