
“నీతులు ఎదుటివారికే ఆచరించడానికి కాదు” అనేది తెలుగులో ఒక నానుడి. ప్రస్తుతం బీజేపీ నేతల పరిస్థితి అలానే ఉంది.”యావత్ భారతావనికి చెబుతున్నా.. మీ ఇంటి చుట్టూ లక్ష్మణ్ రేఖ గీసుకోండి, ఇంటిలో నుండి బయటకు రావొద్దు, సామాజిక దూరమే శ్రీరామరక్ష..! కోవిడ్ నుంచి బయటపడాలంటే లాక్ డౌన్ ఒక్కటే మనముందున్నమార్గం..!” భారత్ ప్రధాని గట్టిగా చెప్పిన మాటలు ఇవి. కొందరు మాత్రం ఇప్పటికీ లైట్ గా తీసుకుంటున్నారు. సాధారణ ప్రజలే కాదు పలువురు రాజకీయ నేతలు సైతం లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తున్నారు. అనుచరులు, కార్యకర్తలతో కలిసి హడావిడి చేస్తున్నారు.తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే.. లాక్ డౌన్ ను ఉల్లంఘించారు. గుంపులుగా ఉండకూడదని చెబుతున్నా.. వందల మంది సమక్షంలో ఆయన బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. సామాజిక దూరం పాటించకుండానే స్థానికులంతా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వివరాల్లోకి వెళ్తే… కర్ణాటక లోని తమకూరు జిల్లా తురువెకెరె నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం. జయరామ్ శుక్రవారం తన పుట్టిన రోజును జరుపుకున్నారు. గుబ్బి తాలుకాలోని స్వగ్రామంలో ఈ వేడుక నిర్వహించారు. ఎమ్మెల్యే బర్త్ డే సంబరాలకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ.. అక్కడ చాలా మంది కనీసం మాస్క్ ధరించలేదు. సామాజిక దూరం అస్సలు పాటించలేదు. ఆ జనం మధ్యే ఎమ్మెల్యే బర్త్ డే కేక్ కట్ చేశారు. అనంతరం వారందరికీ విందు ఏర్పాటు చేశారు. వందలాది మంది గ్రామస్తులు విందు కార్యక్రమానికి హాజరయ్యారు. జనం గుంపులు గుంపులుగా కనిపించడంతో ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. బర్త్ డేను నిరాడంబరంగా జరుపుకొని.. సామాజిక దూరం పాటిస్తూ.. పేదలకు అన్నదానం, నిత్యావసర సరుకులు పంచితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇలా గుంపుల మధ్య కేక్ కట్ చేయడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని విమర్శిస్తున్నారు.