KCR BRS: భారత రాష్ట్ర సమితి తన తొలి అడుగు ఆంధ్ర ప్రదేశ్ లో వేయబోతోంది. సోమవారం తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమితులు కాబోతున్నారు. ఈ కార్యక్రమం లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు.. చంద్రశేఖర్ తో పాటు రావెల కిషోర్ బాబు, పార్థసారథి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులు భారత రాష్ట్ర సమితి కండువా కప్పుకోబోతున్నారు. వీరితోపాటు విద్యార్థి సంఘం నాయకులు కూడా పార్టీలో చేరబోతున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే విజయవాడలో ఓ భవనాన్ని పార్టీ కార్యాలయం గా మార్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా చంద్రశేఖర్ నియామకం ద్వారా కాపు సామాజిక వర్గం ఓట్లను లాగే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.

కర్ణాటకలోనూ
ఆంధ్ర ప్రదేశ్ తర్వాత భారత రాష్ట్ర సమితి తన మలి అడుగును కర్ణాటకలో వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఇందుకు గానూ కర్ణాటకలో నివసిస్తూ రాజకీయంగా ఏదో ఒక పార్టీలో కొనసాగుతున్న తెలుగువారు, తెలంగాణ మూలాలు ఉన్నవారిని ఎంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.. త్వరలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓవైపు జేడీఎస్ అధినేత కుమారస్వామికి తమ మద్దతు ఇస్తూనే… మరోవైపు పార్టీకి బలమైన నాయకులను సమకూర్చుకునేలా వ్యూహాలు కొనసాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో తెలంగాణ సరిహద్దుల్లోని చిల్లరి గ్రామానికి చెందిన పలువురు బిజెపి నాయకులు ఇటీవల భారత రాష్ట్ర సమితిలో చేరారు.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వారికి భారత రాష్ట్ర సమితి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ గ్రామానికి చెందిన పలువురు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై భారత రాష్ట్ర సమితిలో చేరుతామని ముందుకు వచ్చారు.. దీంతో భూపాల్ రెడ్డి ఇటీవల ఆ గ్రామాన్ని సందర్శించారు.. 200 మందిని పార్టీలో చేర్చుకున్నారు.. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తాము 80 సంవత్సరాలుగా నారాయణఖేడ్ నుంచి తమ గ్రామానికి రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని, రోడ్డు వేయాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుతం భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు వేశారని తెలిపారు. అంతేకాదు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రైతులు, ఆడబిడ్డల సంక్షేమానికి పాటుపడుతున్నదని, అందుకోసమే తాము తమ ప్రాంతంలోనూ భారత రాష్ట్ర సమితి బలోపేతానికి కృషి చేస్తామని వారు వెల్లడించారు.

ఆంధ్ర నాయకులు ఏమంటున్నారంటే
భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది నాయకులు సోమవారం తెలంగాణ భవన్ కు వచ్చారు.. వారిలో ఏపీ విద్యార్థి, యువజన జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ కూడా ఉన్నారు..” భారత రాష్ట్ర సమితిలో తమ చేరిక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. గడిచిన తొమ్మిదేళ్లలో చంద్రబాబు, జగన్ అద్వాన పాలనతో ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయం, సంక్షేమం తోపాటు అన్ని రంగాలు విధ్వంసానికి గురయ్యాయి. అన్ని వర్గాల వారు తీరని అన్యాయానికి గురయ్యారు.. అన్ని వనరులు ఉన్నప్పటికీ ఆదుకునేవారు లేక ఆంధ్రప్రదేశ్ అల్లాడుతున్నది. ఉద్యమ నాయకుడు, పరిపాలన దక్షుడైన కెసిఆర్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ సమస్యలు తీరుతాయి.. ప్రధానమంత్రి మోడీ అన్యాయ విధానాలను ఎదిరించి సకల సమస్యల నుంచి భారతదేశాన్ని గట్టెక్కించే ఏకైక నేత కేసీఆర్ మాత్రమే అని” ఆయన వ్యాఖ్యానించారు.. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన నాయకులతో తెలంగాణ భవన్ సందడిగా మారగా… ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఈ చేరికలపై ఎటువంటి స్పందన లేదు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి, జనసేన దీని గురించి మాట్లాడేందుకు నిరాకరించాయి.