BRS In Andhra Pradesh: భారత్ రాష్ట్రసమితి (బీఆర్ఎస్) ఏపీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందా? కాపు సామాజికవర్గాన్నే టార్గెట్ చేయనుందా? పెద్దఎత్తున కాపు సామాజికవర్గం నేతలను చేర్చుకోడం దేనికి సంకేతం? తన మిత్రుడు జగన్ కు మేలు చేయడానికేనా? ఇప్పుడిదే తెలుగునాట చర్చ. బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీకి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. సోమవారం సాయంత్రం ప్రగతిభవన్ వేదికగా దీనికి ముహూర్తం ఖరారు చేశారు. ముగ్గురు కీలక నేతలను గులాబీ గూటికి చేర్చి.. ఏపీలోని మిగతా రాజకీయ పక్షాలకు గట్టి సవాల్ నే విసరనున్నారు. బీఆర్ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్న కేసీఆర్ ముందుగా దయాది రాష్ట్రంపై పడ్డారు. ఏపీపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా రాజకీయ నేతలే కాకుండా బ్యూరోక్రట్లు, పారిశ్రామికవేత్తలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్టు సమాచారం. ఆయన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.కాపు సామాజికవర్గానికి చెందిన ఈయనకు బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. తద్వారా కాపులకు బీఆర్ఎస్ వైపు టర్న్ చేసేందుకు కేసీఆర్ ఎత్తుగడ వేస్తున్నారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఈయన మాజీ ఐఆర్ఎస్ అధికారి. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేత. మరో ఐఆర్ఎస్ మాజీ అధికారి చింతల పార్థసారధి, వ్యాపారవేత్త ప్రకాష్ సైతం బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. ఇందులో ప్రకాష్ బలిజ సామాజికవర్గానికి చెందిన నేత. అనంతపురం జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. అటు పార్థసారధి కూడా జనసేనలో యాక్టివ్ గా పనిచేశారు. ఇటీవల దూరంగా ఉంటున్నారు. వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లా నుంచి పలు నియోజవర్గాల నాయకులు ముమ్మిడివరం నుంచి- జి .రాధాకృష్ణ, పి.గన్నవరం నుంచి కన్నబాబు), కొత్తపేట నుంచి ఎన్. బంగారు రాజు , రామచంద్రాపురం నుంచి- ఎస్.శ్రీనివాసరావు, గన్నవరం నుంచి వి రావు, ఎస్ రాజేష్ కుమార్, జి శ్రీనివాస్, జి రమేష్, యువ నాయకులు కె మురళీకృష్ణ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
అయితే ఏపీలో కీలక నేతలు కారెక్కడం వెనుక కేసీఆర్ పెద్ద వ్యూహమే రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. తొలుత టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు ఉంటాయని భావించారు. కానీ అక్కడ జనసేనతో టీడీపీ పొత్తు ఉంటుందని.. ఆ రెండు పార్టీలు కలిస్తే అధికారంలోకి రావడం ఖాయమని ఎక్కువ మంది నేతలు నమ్ముతున్నారు. అందుకే టీడీపీ నేతలెవరూ పెద్దగా స్పందించలేదు. ఏపీలో బీఆర్ఎస్ రాజకీయ వ్యవహారాలను చూస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలామంది టీడీపీ నేతలను సంప్రదిస్తే వారు పెద్దగా రియాక్టు కాలేదు. ఎన్నికల తరువాత ఉన్న పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. దీంతో గులాబీ బాస్ ఆలోచన మారింది. ముందుగా కులసంఘాల నాయకులను చెరదీద్దామని.. తరువాత నాయకుల సంగతి చూద్దామని భావించారు. కాపు, బలిజ సామాజికవర్గంపై ఫోకస్ పెట్టారు. అయితే బీఆర్ఎస్ లో చేరుతున్న మెజార్టీ నాయకులు ఆ రెండు కులాలకు చెందిన వారే కావడం గమనార్హం.

తెలంగాణలో బీఆర్ఎస్ తో బీజేపీ గట్టిగానే పోరాడుతోంది. అటు చంద్రబాబు సైతం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. బీజేపీకి తెలంగాణలో సహకరించేందుకే చంద్రబాబు పావులు కదుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. దాని ద్వారా ఏపీలో బీజేపీ, జనసేన సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టీడీపీ నాయకులెవరూ బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు ఆసక్తిచూపకపోవడంతో కేసీఆర్ దృష్టి జనసేన, బీజేపీలపై పడినట్టు తెలుస్తోంది. మరోవైపు జగన్ కు కాపులు, బలిజలు దూరమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కడితే మాత్రం ఆ రెండు సామాజికవర్గాలు అటు వైపు మొగ్గుచూపే అవకాశముంది. అదే జరిగితే జగన్ కు భారీగా దెబ్బ తగులుతుంది.
అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కాపులు, బలిజలను బీఆర్ఎస్ వైపు తిప్పుకుంటే బీజేపీ, టీడీపీకి దెబ్బకొట్టినట్టవుతుంది. అటు జగన్ కు మేలు చేసినట్టవుతుంది. అందుకే ఏపీ నుంచి చేరికల విషయంలో కేసీఆర్ భారీ ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు.