Karimnagar Cable Bridge: గత ఏడాది గుజరాత్‌లోని మోర్బీ నగరంలో కేబుల్ వంతెన తెగి వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరమ్మతులు చేసిన కొన్ని రోజులకే ఈ ఘటన జరుగడం గమనార్హం. మరమ్మతు పనులపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అచ్చం ఇలాగే… ఇప్పుడు కరీంనగర్ తీగల వంతెనపై అనుమానాలు కలుగుతున్నాయి. రెండు నెలల క్రితం ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణ లోపాలు ఒక్క భారీ వర్షానికే బయటపడ్డాయి. వంతెన సేఫ్టీవాల్ బీటలు వారింది. వంతెనైకి వెళ్లే అప్రోచ్ రోడ్డుకుంగిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా పనులు చేసి నాణ్యతను విస్మరించారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు స్థానికులతోపాటు రాష్ట్రంలోని అనేక మంది ఇప్పుడు ఈ వంతెన నిర్మాణలోపం, నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభం..
ఉద్యమాల గడ్డ… ఉత్తర తెలంగాణలో కీలక జిల్లా కరీంనగర్ సిగలో మరో మణిహారంగా నిలిచే తీగల వంతెనను నిర్మించారు. 2018లో ప్రారంభించిన పనులు సుదీర్ఘంగా సాగి.. ఎట్టకేలకు పూర్తయ్యాయి. జూన్ 18న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ వంతెనను ప్రారంభించారు.
రూ.224 కోట్లతో నిర్మాణం..
2018లో రూ.224 కోట్ల బడ్జెట్ తో వంతెన పనులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై ఉన్న తీగల వంతెన తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్ బ్రిడ్జి ఇదే. పూర్తిగా విదేశీ ఇంజనీరింగ్ సాంకేతికతతో వంతెన నిర్మించారు. బ్రిడ్జి నాణ్యతను ఇప్పటికే పలుమార్లు ఆర్ అండ్ బీ అధికారులు పరిశీలించారు. వందలాది టన్నుల బరువున్న లారీలను వంతెనపై ఉంచి పరీక్షించారు.
రూ.8 కోట్లతో డైనమిక్ లైటింగ్..
వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత వంతెనకు అదనపు సొబగులు అద్దేందుకు మరో రూ.8 కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సదాశివపల్లి నుంచి తీగల వంతెన వరకు, ఇటువైపు హౌసింగ్ బోర్డు వైపు కమాన్ వెళ్లే మార్గాన్ని కలిపే అప్రోచ్ పనులు పూర్తయ్యాయి. వంతెన నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఆర్ అండ్ బీ అధికారుల సమక్షంలోనే బ్రిడ్జిపై నగరవాసులకు ఉపయోగపడే ఫుడ్, వినోదాత్మక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం పూట వెలుగు జిలుగుల మధ్య మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడి పేందుకు వీలుగా మ్యూజిక్, కొరియా సాంకేతికతతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్, నాలుగు ఎల్‌ఎన్‌ఎస్‌ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కేబుల్ బ్రిడ్జి ప్రత్యేకతలు ఇవే..
500 మీటర్ల పొడవైన రోడ్డు.. నాలుగు వరుసల రహదారి.. 26 పొడవైన స్టీల్ కేబుల్స్ ఇటలీ నుంచి తెప్పించినవి. వంతెనకు రెండు పైళ్ల మధ్య దూరం 220 మీటర్లు నుంచి ఇంటర్మీడియట్‌కు దూరం 110 మీటర్ ఉంటుంది. రూ.224 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ బ్రిడ్జ్ పూర్తిగా అధునాతన ఇంజనీరింగ్ తో రూపొందించారు.
ఒక్క వానకే డ్యామేజీ..
రూ.224 కోట్లతో పూర్తి విదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన కేబిల్ బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు ఒక్క భారీ వర్షానికే బయటపడ్డాయి. వంతెన సేఫ్టీవాల్ ఇటీవల కురిసిన వర్షానికి బీటలు వారింది. మరోవైపు కరీంనగర్‌వైపు నుంచి కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లే రోడ్డు కుంగిపోయింది. దీంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష నేతలు వంతెనను పరిశీలించి మంత్రి గంగుల కమలాకర్ కమీషన్ల కారణంగానే వంతెన పనుల్లో నాణ్యత లోపించిందని ఆరోపిస్తున్నారు. ఇక రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన డైనమిక్ లైట్లు కూడా ఒక్క వర్షానికే కొన్ని మరమ్మతుకు వచ్చాయి.
సోషల్ మీడియాలో వైరల్..
మరోవైపు కేబుల్ బ్రిడ్జి సేఫ్టీ వాల్‌కు ఏర్పడిన పగుళ్లు, కుంగిన రోడ్డుకు సంబంధించిన ఫొటోలను విపక్ష నేతుల సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కమీషన్ల కారణంగా నిర్మాణాలు ఇలా ఉంటున్నాయని పేర్కొంటున్నారు.
స్పందించని ‘గంగుల’
ఇదిలా ఉంటే.. వంతెన నాణ్యతపై మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటి వరకు స్పందించలేదు. వంతెన ప్రారంభం సమయంలో సోషల్ మీడియాలో వీడియోలో, ఫొటోలు పోస్టు చేసిన గంగుల.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలపైగానీ, విపక్షాల విమర్శలపైగానీ నోరు మెదపక పోవడం గమనార్హం.