ఏపీ వైసీపీ ప్రభుత్వంలో త్వరలో నూతన కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జోరందుకోవడంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నవారు ఇప్పటికే తాడేపల్లిలో తిష్ట వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో క్షేత్రస్థాయిలో తాము చురుగ్గా పని చేస్తున్నామని నమ్మకంతో ఉన్నవారు మంత్రి పదవి గ్యారంటీగా చెబుతున్నారు. అయితే వీరిలో ఒక కీలక నాయకుడు అనూహ్యంగా తెరపైకి వచ్చాడు. అతడే విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఈ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న అవంతి శ్రీనివాస్ ను అనేక కారణాలతో తప్పిస్తే.. అదే జిల్లా నుంచి కేబినెట్లో ఇప్పటి వరకు ఓ యువనేత పేరు జోరుగా వినిపించింది. ఆ నేత ఫ్యామిలీ నేపథ్యం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు మోయడం.. అటు అధిష్టానంతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆయనే మంత్రి అవుతారని అంతా ఊహించారు. సామాజిక సమీకరణలు సైతం కలిసివచ్చాయి.
అయితే.. సొంత పార్టీలోనే అంతర్గత కుమ్మలాటలతో తీరికలేకుండా ఉన్న ఈయన్ను పక్కనపెట్టి అనూహ్యంగా కరణం ధర్మశ్రీ పేరును పరిశీలన లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న కరణం అదే రెపొను జగన్ తో కొనసాగిస్తున్నారు. వైఎస్ అంటే ఆయనకు ప్రాణం. గతంలో వైఎస్ మార్గదర్శకత్వంలో పనిచేశారు. ఆయన చెప్పిన మాట వినే నాయకుడిగా గర్తింపు పొందారు. పాదయాత్ర సమయం నుంచి కూడా వైఎస్ తో అనుబంధాన్ని మరింత పెంచుకున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ కు అనుకూలంగా పాటలు రాయడం.. షార్ట్ ఫిల్మ్ లు తీయడం ద్వారా.. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చేందుకు తన ఉడతా భక్తిని ప్రదర్శించారు. 2004లో మాడుగుల ఎమ్మెల్యేగా గెలిచి కరణం ఆ తరువాత వైఎస్ సూచనల మేరకు.. చోడవరంకు మారారు. తరువాత జగన్ రాజకీయ పర్టీ పెట్టగానే ఆయనతోనూ సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. జగన్ ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలపై లఘు చిత్రాలు రూపొందించి.. యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జగన్ కు అనుకూలంగా పాటలు రాయడంలోనూ కరణం ధర్మశ్రీ ముందున్నారు.
దీనికి తోడు విశాఖలో వివాద రహితుడిగా.. ప్రజలను కలుపుకుపోయే నాయకుడిగా.. పార్టీకోసం పనిచేసే నేతగా కూడా కరణం ధర్మశ్రీకి మంచి పేరు ఉంది. ఇటీవల పార్టీలో ఆయన టార్గెట్ గా చిన్న ఇష్యూ జరగడం వెనక కూడా ఆయన నిజాయితీని టార్గెట్ చేసే ప్రయత్నమే అన్న ప్రచారం జరిగింది. ఈ పరిణామాలు అన్ని ఇప్పుడు ఆయనకు మంత్రి పదవిని తెచ్చిపెట్టేందుకు అవకాశాలను కల్పించిందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం మంత్రి వర్గం రేసులో ఉన్న నేతల పేర్ల జాబితాలో కరణం ధర్మశ్రీ పేరు ఉందని అంటున్నారు.