Kapu Ramachandra Reddy: వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైసీపీ హై కమాండ్ టికెట్ నిరాకరించడంతో ఏకంగా సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నమ్మించి మోసం చేస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సిడబ్ల్యుసి సభ్యుడు ఎన్. రఘువీరారెడ్డిని కలిశారు. దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కాపు రామచంద్రారెడ్డి భావిస్తున్నారు. అలాగే రాయదుర్గం నుంచి కుటుంబంలో ఒకరికి బరిలో దించాలని చూస్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో వైసిపి ఓటమి ధ్యేయంగా పని చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకే కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా రఘువీరారెడ్డిని కలుసుకున్నారు. ఈ క్రమంలో రఘువీరా కాళ్లకు కాపు రామచంద్రారెడ్డి నమస్కారం చేశారు. అనంతరం గ్రామంలోని దేవాలయాలను సందర్శించారు. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్, ఏఐసీసీ సభ్యుడు మాణికం ఠాగూర్ తో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకొని ఉన్నట్లు తెలుస్తోంది.
కాపు రామచంద్రారెడ్డి సీనియర్ నాయకుడు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు తప్పకుండా లభిస్తుందని నమ్మకంగా ఉండేవారు. కానీ సీఎం జగన్ ఆయనకు ఝలక్ ఇచ్చారు. ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. తనకు సీటు ఇవ్వకపోవడం పై సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గరే రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీకు గుడ్ బై అంటూ సీఎం క్యాంప్ కార్యాలయానికి సెల్యూట్ చేశారు. జగన్ ను నమ్ముకొని వచ్చినందుకు తమ జీవితాలు నాశనమయ్యాయని వాపోయారు. వైఎస్ జగన్ ను నమ్మి ఆ కుటుంబం వెంట నడిచామని.. ఇప్పుడు తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎలాగైనా ఆ రెండు నియోజకవర్గాల్లో వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి డిసైడ్ అయ్యారు. షర్మిలను తీసుకొచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించాలని.. ఆవేదికలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఒక క్లారిటీ వస్తుంది.