Hariram Jogayya: ఏపీలో కాపులు సంఘటితమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయాలను పక్కన పెట్టి ఒకే గొడుగు కిందకు వచ్చేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆ బాధ్యతలను కాపు సంఘాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఉమ్మడి ఏపీలో, అవశేష ఆంధ్రప్రదేశ్ లో కాపులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య సంధించిన లేఖ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో హీట్ పెంచుతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన జనసేన అధ్యక్షుడు పవన్ కు వ్యతిరేకంగా కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను పాత్రదారులుగా మలచడం రాజకీయంగా కుట్రగా హరిరామజోగయ్య అభివర్ణించారు. మూడు పెళ్లిళ్లు, ప్యాకేజీ నాయకుడంటూ ఎద్దేవా చేసిన నాయకులకు పవన్ చెప్పు చూసి హెచ్చరికలు పంపడం ముమ్మాటికీ సమర్థనీయంగానే చెప్పుకొచ్చారు. ముళ్లును ముళ్లుతోనే తియ్యాలని సందేశం ఇచ్చారని పవన్ కు అభినందనలు తెలిపారు. కాపు జాతిని అడ్డం పెట్టుకొని వైసీపీ అధినేత జగన్ ఆడుతున్న వికృత క్రీడను, వైసీపీలో కాపు నాయకుల పాత్రను ఎండగడుతూ రాసిన ఈ లేఖ పొలిటికల్ సర్కిల్ లో తెగ సర్క్యూలేట్ అవుతోంది.

ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీలో 5,6 శాతం ఉన్న రెడ్డి, కమ్మ సామాజికవర్గం వారు మాత్రమే రాజ్యాధికారం అనుభవిస్తారా? మిగతా 95 శాతం బడుగు, బలహీనవర్గాలు పనికిరారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా 30 శాతం ఉన్న కాపుల మాటేమిటి? అని ప్రశ్నించారు. పవన్ రూపంలో కాపులకు రాజ్యాధికారం వస్తే కుట్రలు, కుతంత్రలతో అడ్డుకోవాలని చూడడం సరైన చర్య కాదన్నారు. అధికారం, పదవుల కోసం సొంత జాతిని కించపరిచే నేతలకు రాజకీయ భవిష్యత్ ఉండదని తేల్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు, లిక్కర్, ఇసుక వ్యాపారాలతో ఆరితేరిపోయిన సీఎం జగన్ కు కాపు జాతి నేతలు పక్కకు తప్పుకోవాలని సూచించే దమ్ము, ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఏపీ సమాజంలో ఉన్న బడుగు, బలహీనవర్గాలకు వచ్చే ఎన్నికల్లో సీఎం పదవి ఇస్తామని ప్రకటిస్తే కాపు జాతి ఆహ్వానిస్తుందని.. వచ్చే ఎన్నికల్లో బలపరచడానికి సిద్ధంగా ఉన్నామని.. ఆ ప్రకటన చేసే దమ్ము జగన్ కు ఉందా అని నిలదీశారు.

అంతటితో ఆగకుండా హరిరామ జోగయ్య కఠువైన మాటలు, వ్యాఖ్యానాలతో లేఖలో ప్రస్తావించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజమైన కాపు జాతికి పుట్టిన వారైతే, బడుగు బలహీనవర్గాల వారి సంక్షేమాన్ని కోరుకున్న వారైతే రెడ్డి సామాజికవర్గం వారిని ఊడిగం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని కూడా సూచించారు. లేకుంటే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవడం ఖాయమని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో పవన్ రూపంలో కాపులకు వచ్చిన అవకాశాన్ని సామాజికవర్గం నేతలు సద్వినియోగం చేసుకోవాలని కూడా సూచించారు. అయితే హరిరామజోగయ్య రాసిన ఈ లేఖతో కాపు సామాజికవర్గ నేతలు పునరాలోచనలో పడతారో.. లేకుంటే తమకు అలవాటైన ఎదురుదాడికి సిద్ధమవుతారో చూడాలి మరీ.