Ap Cast Politics: ఏపీలో ఇప్పుడు రాజకీయం ప్రధానంగా మూడు కులాల చాటున జరుగుతోంది. ఇన్నాళ్లు ఏపీలో బలంగా ఉన్న రెడ్లు, కమ్మ సామాజికవర్గం మాత్రమే రాజకీయ అధికారాన్ని చేపట్టి మెజార్టీగా ఉన్న కాపులు,దళితులను తమ కింద పెట్టుకొని రాజకీయం చేసేవారు.వారికి పదవులతో మాయ చేసేవారు. కానీ జనసేన-ఏపీ బీజేపీ వచ్చాక ఏపీలో కాపులు బలమైన శక్తిగా అవతరించే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ అయితే కాపులు, బలిజలు , ఇతర కులాలు, బీసీలు, ఎస్సీలతో కలిసి ఒక బలమైన కూటమిని తయారు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది.
ఏపీ రాజకీయాల్లో కాపులు సత్తా చాటే సమయం వచ్చేసింది. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా కాపు సామాజికవర్గం ఐక్యత చూపి కీలకంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జనసేన ప్రస్తుతం యాక్టివ్ అవుతున్న దృష్ట్యా కాపుల్లో అనైక్యత పోయి ఐక్యంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఏపీలో మళ్లీ కాపు రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తోంది. ఇదే రానున్న ఎన్నికల్లో కీలకంగా మారనుంది. అయితే ఇది జనసేనకు అడ్వంటేజ్ గా మారునుందా? లేక అధికార వైసీపీ క్యాష్ చేసుకుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది.
-కాపులను ఏకం చేసిన వంగవీటి రంగా..
ఏపీలో తెలుగు నాట ‘కాపుల’ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికీ మూడు సార్లు టీడీపీ ఈ కాపుల వ్యతిరేకతతో ఓడిపోయింది. 1989లోనూ వంగవీటి రంగా హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో కాపుల్లో ఐక్యతతో తెలుగు దేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పరాజయానికి కాపుల్లో వచ్చిన వ్యతిరేకతే కారణమన్నారు. రంగా హత్య ఏపీ రాజకీయాలను చాలా ప్రభావితం చేసిందంటారు. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి కాపుల సమస్య వెంటాడింది.
-చిరంజీవి, పవన్ రాకతో కాపుల్లో కొత్త ఆశ
వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీలో నిజానికి 2009లో ఓడిపోయింది. కానీ గెలిచిందంటే కారణం చిరంజీవి పెట్టిన ‘ప్రజారాజ్యం’ పార్టీ. 2009 ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సింది. కానీ ఆ పార్టీ ఓటు బ్యాంకుకు భారీగా ప్రజారాజ్యం గండికొట్టింది. ఫలితంగా కాంగ్రెస్ రెండోసారి గెలిచింది. ఏకంగా 18 శాతం ఓటు బ్యాంకును ప్రజారాజ్యం సంపాదించింది. అదంతా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. టీడీపీకి పడాల్సింది.. ప్రజారాజ్యంకు పడింది. చిరంజీవి పార్టీ పెట్టడంతో కాపుల్లో ఒకరకమైన రాజ్యాధికారం ఆశ మొదలైంది. కానీ చిరంజీవి జెండా ఎత్తేసి కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఇప్పటికీ కాపులు ఆయన తమ్ముడు పెట్టిన జనసేనను నమ్మని పరిస్థితికి వచ్చింది. పవన్ అందుకే ఇటీవల సభలో నాడు వెనకడుగు వేసినందుకు తనను రెండు చోట్ల ఓడించారని ఈసారి ఖచ్చితంగా నమ్మిన ప్రజల వెంట నిలబడుతానని ప్రజలను వేడుకున్నారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలతో మరోసారి కాపులంతా ఆలోచనలో పడ్డారు. 2024లో కాపులు, ఇతర కులాలను పవన్ ఏకంగా చేస్తే.. ఏకం అయితే ఖచ్చితంగా రాజ్యాధికారం సాధ్యమేనంటున్నారు.
-2019 ఎన్నికల్లోనూ చంద్రబాబుకు కాపుల దెబ్బ
నిజానికి 2009లోనే కాదు.. 2019లో కూడా ఏపీ పాలిటిక్స్ లో జనసేన ఒంటరిగా పోటీచేయడం టీడీపీకి భారీ మైనస్ అయ్యింది. చంద్రబాబుకు కాపుల దెబ్బ పడింది. దాంతో ఆయన ఘోర ఓటమిని చవిచూశారు. జనసేనతో కలిసి 2014లో గెలిచిన బాబు.. 2019లో విడిపోయి ఫలితం అనుభవించారు.
-జనసేన కీలకం.. బాబు దోస్తానా?
అందుకే 2024 ఎన్నికల్లో కాపులు, ఇతర వర్గాలకు ఏకం కావాలని పవన్ పిలుపునిచ్చారు. వారిలో ఐక్యతకు అడుగులు వేస్తున్నారు. ఈ విషయం తెలుసు కాబట్టే ‘బద్వేలు’ ఉప ఎన్నికల్లో పవన్ పిలుపు మేరకు చంద్రబాబు పోటీచేయకుండా విరమించుకున్నారని అంటున్నారు. చంద్రబాబుకు కాపు సామాజికవర్గం కీలకంగా మారనుంది. కాపుల మద్దతు ఉంటేనే విజయం దక్కుతుందని తెలిసి వచ్చింది. లేకుంటే మరోసారి పరాజయం తప్పదని జనసేనతో కలిసి వెళ్లేందుకు బాబు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జనసేనతో పొత్తు కుదిరితే చంద్రబాబు కు సానుకూలంగా ఉంటుంది. లేకుంటే మరోసారి ఓటమి తప్పదని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే పవన్ నిర్ణయాలకు అనుగుణంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే జనసేన మెజార్టీ సీట్లు సాధిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలుంటాయి. అదే జరిగితే అనాధిగా రాజ్యాధికారం కోసం చూస్తున్న ‘కాపుల’ కల నెరవేరినట్టే.. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.