కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదనే సంగతి తెలిసిందే. ఏపీలోని ట్రిపుల్ ఐటీలలో ప్రతి సంవత్సరం పదో తరగతి ఫలితాల ఆధారంగా ప్రవేశాలు జరిగేవి. అయితే గతేడాది, ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జరగకపోవడంతో ప్రత్యేక పరీక్షను నిర్వహించి విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలను కల్పిస్తున్నారు. నేడు ఏపీ ఆర్జీయూకేటీ సెట్-2021(AP IIIT Results 2021) ఫలితాలు విడుదలయ్యాయి.

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆర్జీయూకేటీ సెట్-2021 పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. గత నెల 26వ తేదీన పరీక్ష జరగగా పది రోజుల్లోనే ఫలితాలు విడుదల కావడం గమనార్హం. పరీక్ష రాసిన విద్యార్థులు rgukt.in వెబ్ సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వెబ్ సైట్ లోని హోమ్ పేజీలో ఆర్జీయూకేటీ సెట్ 2021(AP IIIT Results 2021) అనే ట్యాబ్ ను క్లిక్ చేసి పుట్టినతేదీ, రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలను ఎంటర్ చేయాలి.
ఈ విధంగా పరీక్ష రాసిన విద్యార్థులు రిజల్ట్, ర్యాంక్ కార్డ్ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అనంతపురం జిల్లాలోని ధర్మవరంకు చెందిన ఎం.గుణశేఖర్ తొలి మొదటి ర్యాంకును సాధించగా కడప జిల్లా మైదుకూరుకు చెందిన శ్రీచక్రధరణి రెండో ర్యాంకును, విజయనగరం జిల్లాకు చెందిన ఎం.చంద్రిక మూడో ర్యాంకును సాధించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని జమ్మలమడుగుకు చెందిన వెంకటసాయి సుభాష్ నాలుగో ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన మనోజ్ఞ ఐదో ర్యాంకును సాధించారు.
ఎంపికైన విద్యార్థులు ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లలో 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. సెమిస్టర్ విధానంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లలో విద్యా బోధన జరగనుంది.