
Kanna Lakshminarayana: బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కీలక అడుగులు వేస్తున్నారా? ఆయన బీజేపీని వీడడం ఖాయమా? ఇప్పటికే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారా? అందుకే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహంపై విమర్శలకు దిగారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత రెండు రోజులుగా ఆయన ప్రకటనలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు హైకమాండ్ మంచి గుర్తింపునే ఇచ్చింది. అప్పటివరకూ ఉన్న సీనియర్లను కాదని కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అయితే ఎన్నికల తరువాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయన్ను అధ్యక్ష పదవిని తప్పించి సోము వీర్రాజుకు అప్పగించారు. అయితే అప్పటి నుంచి పార్టీలో కన్నా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తనను తప్పించడకం కంటే.. తనకు గిట్టని సోము వీర్రాజుకు అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: PM Modi Meets Actors: కేజీఎఫ్, కాంతారా హీరోలతో మోడీ స్కెచ్.. ప్రత్యర్థులకు నోట మాటరాదంతే!
అయితే ఏపీ బీజేపీని బలోపేతం చేయడం కంటే.. పార్టీలో పట్టు సాధించేందుకే నేతలు ప్రయత్నిస్తున్నారన్న అపవాదు ఉంది . రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు పార్టీలో కన్నా ముద్ర లేకుండా చూడాలని ప్రయత్నించారు. ఇందులో సక్సెస్ అయ్యారు కూడా. కన్నా హయాంలో నియమితులైన జిల్లా కార్యవర్గాలను రాత్రికి రాత్రే రద్దు చేశారు. తనకంటూ ఒక సొంత టీమ్ ను నియమించుకున్నారు. ఇప్పటికే వేడితో ఉన్న కన్నా ఈ వ్యవహారంతో మరింత రెచ్చిపోయారు. అందులో భాగంగానే సోము వీర్రాజు, జీవీఎల్ పై నేరుగా విమర్శలకు దిగారు. టీడీపీ, జనసేనలతో పొత్తుకు వీరే అడ్డంకిగా నిలుస్తున్నారని భావించి ఆరోపణల డోసును పెంచారు.
కాపులతో సన్మానాలు చేయించుకునేందుకు జీవీఎల్ ఎవరని ప్రశ్నించారు. రాజ్యసభలో చిన్న ప్రశ్నకు ఇన్ని సన్మానాలు అవసరమా అని కూడా నిలదీశారు. అసలు జీవీఎల్ రాజ్యసభలో వేసిన ప్రశ్న గూగుల్ లో వెతికినా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అటు సోము వీర్రాజుపై కూడా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ బలహీనం కావడానికి, పవన్ బీజేపీకి దూరమవ్వడానికి సోము వీర్రాజు వ్యవహార శైలే కారణమంటూ ఆరోపించారు. దీంతో కన్నా అమీతుమీకి సిద్ధమయ్యారని అర్ధమవుతోంది. బీజేపీ తనను దూరం చేసుకుంటే మంచిదన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. అందుకే శృతిమించి ఆరోపణలు చేస్తున్నారు. కానీ పార్టీ హైకమాండ్ ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. కనీసం ఆరా తీయడం లేదు. అందుకే ఆయన పార్టీని వీడేందుకు దాదాపు సిద్ధపడినట్టు తెలుస్తోంది.

తొలుత జనసేనలో చేరుతారని అంతా భావించారు. ఆ పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ చర్చలు జరపడంతో దాదాపు జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. వారాహి వాహన పూజలు, రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా పవన్ విజయవాడ వచ్చినప్పుడు పార్టీలో చేరేందుకు అనుచరులు సన్నాహాలు చేసుకున్న ప్రచారం జరిగింది. కానీ బీజేపీ కోసం వేచిచూసే ధోరణిలో ఉన్న పవన్ కన్నా చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే గత రెండు రోజులుగా కన్నా విభిన్న ప్రకటనలు చేశారు. కాపులకు చంద్రబాబు, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు మాత్రమే మంచి చేశారని ప్రకటించారు. దీంతో కన్నా స్ట్రాటజీ మారినట్టు వార్తలు వస్తున్నాయి. అయినా టీడీపీలోకి వెళతారన్న ప్రచారం ఊపందుకుంది. సత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఫిక్సయ్యారని సమాచారం. ఈ నెల 24న చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకుంటారని కూడా తెలుస్తోంది. మొత్తానికైతే కన్నా అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు గూటికి చేరుతుండడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read:AP New Governor: ఏపీ గవర్నర్ మార్పు.. అంతబట్టని బీజేపీ రాజకీయం..ఎవరికి చేటు?