Kanna Lakshminarayana : టిడిపి సీనియర్ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ( kanna Lakshmi Narayana ) సందడి లేదు. కనీసం ఆయన మీడియా ముందుకు కూడా రావడం లేదు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గాన్ని కేటాయించారు చంద్రబాబు. అక్కడ కమ్మ సామాజిక వర్గం కన్నా లక్ష్మీనారాయణ ను వ్యతిరేకిస్తోంది. దీంతో టీడీపీలో గ్రూపులు మొదలయ్యాయి అన్న ప్రారంభం అయింది. మరోవైపు మంత్రి పదవి ఆశించిన కన్నా లక్ష్మీనారాయణకు చాన్స్ దక్కలేదు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గానికి సైతం కన్నా లక్ష్మీనారాయణ అందుబాటులో లేరన్న ప్రచారం జరుగుతోంది.
Also Read : ఆ సీనియర్ ఎమ్మెల్యే సైలెన్స్ వెనుక కథేంటీ?
* కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగిన నేత..
కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో( Congress Party) ఒక వెలుగు వెలిగారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన 1989 నుంచి 2004 వరకు.. నాలుగుసార్లు అతిపెద్ద నియోజకవర్గమైన పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో మాత్రం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తొలిసారిగా 1991లో మంత్రి అయ్యారు. అటు తర్వాత 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సహకార శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2014 రాష్ట్ర విభజన వరకు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడుతుండగా బిజెపి నుంచి ఆఫర్ వచ్చింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొన్నేళ్ల పాటు వ్యవహరించారు. 2024 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఆయనకు సత్తెనపల్లి టికెట్ లభించింది.
* పెరుగుతున్న కుమారుడి ప్రాబల్యం
అయితే సత్తెనపల్లి( sattenapalle) నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ కుమారుడి ప్రాబల్యం పెరుగుతోంది. ఇది కమ్మ సామాజిక వర్గం నేతలకు రుచించడం లేదని తెలుస్తోంది. కన్నా కుమారుడు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని రుజువులతో సహా కమ్మ నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. ఇప్పటికే మంత్రిగా అవకాశం లేకపోవడంతో కన్నా లక్ష్మీనారాయణ లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం నేతలు తన కుటుంబాన్ని విభేదించడంపై లక్ష్మీనారాయణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి తనకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వరని ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా ప్రచారం సాగుతోంది. అందుకే కొద్ది రోజులపాటు రాజకీయంగా సైలెంట్ గా ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నట్లు సమాచారం.
* తొలుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు..
2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ జాయిన్ అవుతారని అంతా భావించారు. కాపు సామాజిక వర్గం నేత కావడంతో జగన్మోహన్ రెడ్డి సైతం కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న కన్నాకు బిజెపి హై కమాండ్ వద్దని వారించిందని.. బిజెపి ఏపీ చీఫ్ పదవి ఇచ్చేసరికి ఆయన వెనక్కి తగ్గారు. అయితే నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉంటే.. జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ఉండేవారని కన్నా భావిస్తున్నట్లు అనుచరులు చెబుతున్నారు. అయితే ముందు రాజకీయ పరిణామాలు మారితే కన్నా లక్ష్మీనారాయణ వేరే ఆలోచనకు వెళ్లడం ఖాయమని అనుచరులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : కాకరేపుతున్న కన్నా వ్యాఖ్యలు.. జగన్ గురించి వైఎస్ దగ్గర తప్పుగా మాట్లాడిందెవరు?