విశాఖపట్నం స్టైరీన్ గ్యాస్ లీక్ విషాద సంఘటనకు ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని తేటతెల్లమయిన నేపథ్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారని, వీరిలో అమాయకపు పసిపిల్లలు కూడా ఇద్దరు ఉన్నారని తెలిపారు.
ఈ సంఘటన భోపాల్ గ్యాస్ లీక్ విషాదాన్ని గుర్తు తెస్తోందని, శరవేగంగా పోలీసు యంత్రాంగం, స్థానిక యువత తక్షణ సహాయక చర్యలు చేయడంతో మరణాల శాతం గణనీయంగా తగ్గించడంలో ఉపయోగపడిందని కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణ ప్రమాదానికి కారణమన్నది తిరుగులేని వాస్తవమని, ఈ దుర్ఘటనలో బాధితులు అత్యంత ప్రమాదకరమైన స్టైరీన్ విష వాయువు పీల్చడంతో వారి జీవితాంతం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసిన దుస్థితి ఏర్పడిందని కన్నా లక్ష్మీనారాయణ గారు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనలకు వ్యతిరేకంగా భద్రత ప్రమాణాలు పాటించకుండా మరియు పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకంగా నిబంధనలను ఉల్లంఘించి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం కర్మాగారాన్ని నడపడం విషయంలో ప్రభుత్వ అధికారులు తనిఖీ చేయడంలో విఫలమైనట్లు స్పష్టం అవుతోందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని లేకపోతే ఇలాంటి ప్రమాదకర సంఘటనలు పునరావృతం అవుతాయని కన్నా లక్ష్మీనారాయణ లేఖ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
మరో లేఖలో పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరారు. కోవిడ్ 19 విపత్తు వేళ విద్యుత్ ఛార్జీలు పెంచడం సరైన చర్య కాదన్నారు. విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని చెప్పారు. ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరలు రద్దు చేయాలని, బిల్లులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.