
KA Paul : ఏదైనా చెబితే ఆ మాటకు ఒక విలువ, నమ్మకం ఉండాలి. కనీసం వాస్తవానికి దగ్గరగానైనా మాట్లాడాలి. తన హోదాకు తగ్గట్టు మాట్లాడాలి. కానీ ఇవేవీ పాటించడం లేదు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్. ఎప్పటికప్పుడు కామెడీ మాటలతో వినోదం పంచుతున్న ఆయన ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం చుట్టూ తిరుగుతున్నారు. మొన్నటి వరకూ తెలంగాణ ఉప ఎన్నికల్లో తెగ హడావుడి చేశారు. డ్యాన్స్ లతో తనకున్న ఇమేజ్ ను , పెద్దరికాన్ని పోగొట్టుకున్నారు. చివరాఖరుకు ఓ తెలంగాణ యువకుడితో చెంపదెబ్బలు తిన్నారు. అయితే ఆ పరిస్థితిని చూసిన వారు అయ్యో పాల్ ఎందుకు ఇలా తయారయ్యారు అని జాలిపడ్డారు. అయితే అక్కడితో ఆగకుండా ఇప్పుడు ఏపీ రాజకీయాలపై పాల్ ఫోకస్ పెట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గట్టిగానే నిలబడేందుకు డిసైడ్ అయ్యారు. కానీ ఆయన చెబుతున్న మాటలు మాత్రం నమ్మబుద్ధి కావడం లేదు.
మొన్న జేడీతో హల్ చల్..
మొన్నటికి మొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాల్ ప్రత్యక్షం కావడంతో మంచి లైన్ పట్టుకున్నారని అంతా భావించారు. గాడిలో పడినట్టేనని చెప్పుకొచ్చారు. అయితే తీరా అక్కడ కూడా జేడీకి డామినేట్ చేసి కేఏ పాల్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ను కొనేస్తానని కూడా చెప్పుకొచ్చారు. దీంతో జేడీ లక్ష్మీనారాయణ ఖిన్నుడవ్వాల్సి వచ్చింది. ఆయన సర్దిచెబుతున్నా పాల్ వినకుండా ఆడిన మాటలు మీడియా మిత్రులకు వినోదాన్ని పంచిపెట్టాయి. ఇంత బతుకు బతికి ఇదేంది జేడీ అంటూ కామెంట్స్ చేస్తున్న వారే అధికమయ్యారు. ఆ సమయంలో పాల్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో అసలు సీఎం జగన్ ఏంచేశారని కేఏ పాల్ ప్రశ్నించారు.తనకు యాక్టింగ్ రాదని.. యాక్షన్ మాత్రమే వచ్చన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కపట నాటకాలు ఆడుతోందని ఆరోపించారు.
రెండు వారాల్లో ఆ మొత్తం చెల్లిస్తా..
విశాఖ ఉక్కు కొనుగోలుకు రూ.42 వేల కోట్లతో బిడ్ వేయనున్నట్టు తాజాగా పాల్ ప్రకటించారు. దీంతో పాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నివాసముంటున్న తన తండ్రి బర్నబాస్ ను కలిసేందుకు పాల్ ఆదివారం వచ్చారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్నవారందర్నీ పలకరించారు. బిడ్ వేయడానికి అవసరమైన పత్రాల కోసమే తాను నర్సీపట్నం వచ్చినట్టు చెప్పుకొచ్చారు. రూ.3.5 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ను .. రూ.3,500 కోట్లకు విక్రయించాలని చూస్తున్నారని.. అందుకే రూ.4 వేలు కోట్లు ఇచ్చి దానిని తీసుకుందామనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. పనిలో పనిగా అటు చంద్రబాబు, జగన్ లపై సైతం సెటైర్లు వేశారు. వారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి చేర్చారని ఆరోపించారు. కేసీఆర్ చర్యలను తప్పుపట్టారు. ఉట్టికెక్కలేరు కానీ అంటూ .. వీరు స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొంటారా? అని ప్రశ్నించారు. జేడీ లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తానని చెప్పారు. మరో రెండు వారాల్లో రూ.4 కోట్లు ఇచ్చి విశాఖ స్టీల్ ను రక్షించుకుంటానని పాల్ ప్రకటించారు. కానీ దీనినిస్థానికులు లైట్ తీసుకున్నారు. పాల్ చెప్పింది కామెడీగా ఉందని నవ్వుకున్నారు.