Homeఆంధ్రప్రదేశ్‌KA Paul: తెలంగాణ సీఎంగా నేను.. ఏపీ సీఎంగా మహిళా నేత...కేఏ పాల్ మళ్లీ ఏశాడు

KA Paul: తెలంగాణ సీఎంగా నేను.. ఏపీ సీఎంగా మహిళా నేత…కేఏ పాల్ మళ్లీ ఏశాడు

KA Paul: ఆయన పేరులో ఆనందం ఉంది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆనందం పరవశింపజేస్తారు. నలుగురికి ఆనందం నింపుతారు. అలాగని ఆయనేదో అల్లాటప్పా మనిషి అనుకుంటే పొరబడినట్టే. ప్రపంచ దేశాలకు సుపరిచితులు. ప్రపంచలోని దేశాధినేతకు అభిమాన పాత్రుడు. కోట్లాది మంది భక్తులకు దైవదూత..ఈపాటికే మీకు అర్ధమై ఉంటుంది. ఆయనే కిలారి ఆనందపాల్.. అందరూ ముద్దుగా కేఏ పాల్ అని పిలుచుకుంటారు. మత ప్రబోధకుడి నుంచి రాజకీయ వేత్తగా మారిన తరువాత కేఏ పాల్ ప్రకటనలు, మీడియా సమావేశాలకు, టీవీ చర్చలకు ఎనలేనంత క్రేజ్ ఏర్పడింది. వాటితో ఆయన లబ్ధి పొందారో లేదో కానీ మీడియా చానళ్లు మాత్రం తమ టీఆర్పీని పెంచుకునే ప్రయత్నం చేశాయి. అందుకే ఆయన ఎక్కడికి వెళితే అక్కడకు మీడియా వెంటాడుతోంది. చిన్నపాటి పనిచేసినా హైప్ లభిస్తోంది. రాష్ట్రంలో సీఎం, ప్రతిపక్ష నేతలు, మంత్రులు, కీలక నాయకులు ఉన్నా.. ఎవరికీ లేని విధంగా మీడియా అనుకరణ కేఏ పాల్ కే ఉందంటే ఆయన వ్యాఖ్యాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ ప్రమోషన్ వర్కులో ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారు.

KA Paul
KA Paul

వారికి డిపాజిట్లు దక్కవు..
తిరుపతిలో పర్యటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఉభయ రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్, చంద్రబాబులు ఓడిపోతారని జోస్యం చెప్పారు. వారికి కనీసం డిపాజిట్లు కూడా రావని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను, ఏపీ సీఎంగా ఓ మహిళా నేత ప్రమాణస్వీకారం చేస్తారని కూడా బదులిచ్చారు. ఏపీలో ప్రజల మద్దతు ప్రజాశాంతి పార్టీకే ఉందని చెప్పుకొచ్చారు. అసలు చంద్రబాబు, పవన్ ల కంటే ప్రజలు తననే ఎక్కువగా అభిమానిస్తున్నారని కూడా తేల్చేశారు. తానే సీఎంగా ఉండాలని కూడా కోరుకుంటున్నారని చెప్పారు. కానీ తాను తెలంగాణ సీఎంగా ఉంటూ..ఇక్కడ ఓ మహిళా నేతను కూర్చోబెడతానని కూడా కేఏ పాల్ తన మనసులో ఉన్న మాటను చెప్పేశారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉభయ రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లు ఐక్యతగా ఉంటే అభివృద్ధి సాధ్యమయ్యేదని.. కానీ వారు చెరో మార్గంలో ప్రయాణిస్తుండడంతో నష్టం జరుగుతోందన్నారు.

Also Read: BJP Politics: టీఆర్ఎస్ వాళ్లు కష్టం.. కాంగ్రెస్ వాళ్లు జాప్యం.. బీజేపీ బలోపేతమెప్పుడు?

ఒకే రోజులో క్రేజ్…
తెలంగాణాలో ఒకే ఒక రోజులో తనకు 30 లక్షల మంది మద్దతు పెరిగిందని కూడా కేఏ పాల్ ప్రకటించేశారు. తనపై దాడి జరగడంతో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిందన్నారు. ఆ పరిణామంతో తెలంగాణ రాజకీయ స్ట్రేటజీ కూడా మారిపోయిందని చెప్పారు. తనకు తెలంగాణలో ఇక తిరుగులేదన్నారు. తాను సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని కూడా చెప్పారు. దేశ రాజకీయాల గురించి కూడా కేఏపాల్ ప్రస్తావించారు. ఇండియా శ్రీలంక మాదిరిగా కాకుండా ఉండాలంటే తక్షణం మోదీని ప్రధాని పదవి నుంచి దింపేయ్యాలన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీకి విలువైన సలహాలు ఇచ్చినా పాటించలేదన్నారు. దేశాన్ని కాపాడడం మోదీ వల్ల కాదని కూడా పాల్ తేల్చేశారు.

KA Paul
KA Paul

తిరుపతిలో హల్ చల్..
అయితే అంతకు ముందు తిరుపతిలో కేఏ పాల్ హల్ చల్ చేశారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో పర్యటించారు. మొత్తం ఐదు వాహనాలతో యూనివర్సిటీ గేటు దాటి లోపలికి వెళ్లిపోయారు. భద్రతా సిబ్బంది వారిస్తున్నా వినలేదు. దీంతో యూనివర్సిటీ వర్గాలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన వారు అక్కడకు చేరుకున్నారు. కేఏ పాల్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పాల్ తన వాహనంలోనే ఉండిపోయారు. దాంట్లోనే స్టేషన్ కు వస్తానని చెప్పారు. దీంతో పోలీసులు అక్కడ నుంచి పంపించేశారు. తరువాత యూనివర్సిటీ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. మొత్తానికైతే కిలారి ఆనంద్ పాల్ తిరుపతి ప్రజలకు భలే వినోదాన్ని అందించారు.

Also Read:YSRCP- Central Government: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు..వైసీపీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోందా?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version