Justice Dy Chandrachud: అత్యున్నత న్యాయవ్యవస్థకు మరో కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త సీజేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రితోపాటు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టున్యాయమూర్తుల సమక్షంలో ఈ కార్యక్రమంగా ఘనంగా జరిగింది.
ఆశ్చర్యకరంగా చంద్రచూడ్ తండ్రి 44 ఏళ్ల క్రితం జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా ఉన్నారు. 1978 నుంచి 1985 వరకూ ఈయన సీజేఐగా పనిచేశారు. ఆయన తనయుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ తాజాగా అత్యున్నత పీఠాన్ని అధిరోహించాడు. ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్ పదవీకాలం 2024 నవంబర్ 10 వరకూ ఉంది. రెండేళ్ల పాటు సీజేఐగా వ్యవహరిస్తారు.
అక్టోబర్ 11న జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ వారసుడిగా జస్టిస్ చంద్రచూడ్ ను సూచించారు. అక్టోబర్ 17న తదుపరి సీజేఐగా రాష్ట్రపతి నియమించారు.
-జస్టిస్ డీవై చంద్రచూడ్ ఎవరు? నేపథ్యం ఏంటి?
1959 నవంబర్ 11న ఈయన ముంబైలో జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో ముంబైలోనే చదువుకున్న ఈయన న్యాయవిద్యను పూర్తి చేశారు. ముంబై హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. అలహాబాద్, ముంబై హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1998-2000 మధ్య అదనపు సొలిసిటర్ జనరల్ గానూ జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు నిర్వర్తించారు.
అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భ విచ్ఛిత్తి, ఆధార్ చట్టాన్ని మినీ బిల్లుగా ఆమోదించడం తదితర కేసుల్లో జస్టిస్ డీవై చంద్రచూడ్ చారిత్రక తీర్పులు ఇచ్చారు. కరోనా సమయంలో కేంద్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ‘జాతీయవిపత్తుగా’ ప్రకటించి ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చేలా చేయడంలో చంద్రచూడ్ కీలక పాత్ర పోషించాడు.
ఇలా ఎన్నో కీలక కేసుల్లో కీలకంగా తీర్పులిచ్చిన చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికవ్వడం చూసి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.