Chandrababu Jail: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా కేసులోవాదనలు వింటున్న న్యాయమూర్తి, జైలు అధికారులు వైసీపీ నేతలకు సమీప బంధువులుగా ప్రచారం జరుగుతోంది. అందుకే చంద్రబాబుకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని టాక్ నడుస్తోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఇటువంటి కథనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజులు పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయమూర్తి హిమబిందు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జడ్జి పేరు మార్మోగిపోయింది. కేసు నమోదు తో పాటు సెక్షన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని.. అసలు ఆధారాలే లేవని.. చంద్రబాబు కేసును కొట్టేస్తారని అంతా భావించారు. కొందరు న్యాయ కోవిదులు, నిపుణులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ అనూహ్యంగా చంద్రబాబుకు రిమాండ్ విధించారు. దీంతో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఒక్కసారి షాక్ కు గురయ్యారు. ఈ తరుణంలో వ్యవస్థల తీరును తప్పుపడుతూ ఎక్కువమంది కామెంట్స్ చేశారు.
అయితే తాజాగా జడ్జి హిమబిందు గురించి సోషల్ మీడియాలో ఒక ప్రచారం వెలుగు చూసింది. ఆమె వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమీప బంధువు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం లోకేష్ అనుమానం వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు. దీనిపై మోపిదేవి వెంకటరమణ వివరణ ఇచ్చారు. మరోవైపు గతంలో సీఎం జగన్తో జడ్జి హిమబిందు దిగిన సెల్ఫీ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
అలాగే రాజమండ్రి సెంట్రల్ జైల్ ఇన్చార్జిగా కోస్తా జైళ్ల శాఖ డిఐజి తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఇప్పటివరకు ఉన్న జైల్ అధికారి సెలవు పై వెళ్లడంతో.. ఆ స్థానంలో ఏకంగా డిఐజి రావడం విశేషం. గతంలో ఈయన కడప జిల్లాలో పనిచేసేవారు. ముందస్తు ప్లాన్ తోనే కోస్తాంధ్ర రీజన్ కు డిఐజిగా వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరికి మూలాఖత్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే చంద్రబాబు అరెస్ట్ కేసులో కీలకమైన అధికారులపై ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది.