JT Rama Rao: రాష్ట్ర విభజన సమయంలో సమైఖ్యవాదాన్ని చాటిచెప్పడంలో చాలామంది నేతలు ముందుండే వారు. కేసీఆర్ కు మాటలకు ధీటైన జవాబిచ్చారు. ఆయన ఒక మాట అంటే పది మాటలు మాట్లేడేవారు. కేసీఆర్ తిట్ల దండకం అందుకుంటే అంతకు మించి మోతాదులో బదులిచ్చేవారు. కానీ అటువంటి వారంతా ఇప్పుడు అదే కేసీఆర్ పంచన చేరుతున్నారు. బీఆర్ఎస్ విస్తరణ పని మీద ఉన్న కేసీఆర్ ఖమ్మంలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేసుకుంటున్నారు. లక్షలాది మంది జన సమీకరణ చేస్తున్నారు. తెలంగాణలో అధికార పార్టీగా అది ఏ మాత్రం పెద్ద పనికాకున్నా.. ఏపీ నుంచే సమీకరించాలని నేతలకు కేసీఆర్ టాస్క్ ఇచ్చారు. దీంతో వారు ఏపీ నుంచి వీలైనంత ఎక్కువ మందిని ఖమ్మం తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నాడు స్వరాష్ట్రం కోసం తెలంగాణ వాదులు ప్రయత్నించగా.. అడ్డుకునేందుకు సమైఖ్య వాదులు ప్రయత్నించారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. కానీ కొద్దిరోజుల వ్యవధిలోనే సమైఖ్య ఉద్యమం పతాక స్థాయికి తీసుకెళ్లడంలో రాణించారు. అయితే స్వరాష్ట్ర ఆకాంక్ష ఎదుట అది నిలవలేకపోయింది. రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఎనిమిదేళ్లు గడిచేసరికి నాడు కలబడిన వారంతా ఇప్పుడు స్నేహితులుగా మారుతున్నారు. శత్రువుకంటే ప్రమాదకరిగా అభివర్ణించే ఏపీ ప్రజల అవసరం కేసీఆర్ కు వచ్చింది. నాడు తన ప్రత్యర్థులుగా ఉన్న సమైఖ్యవాదులను మిత్రులను చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందర్ని మిత్రులుగా మార్చుకున్నారు. ఖమ్మంలో జాతీయ పార్టీ ఆవిష్కరణ సభకు ప్లాన్ చేస్తున్న గులాబీ బాస్ ఏకంగా ఉత్తరాంధ్ర నుంచి సైతం వీర సమైఖ్యవాదులను ఆకర్షించడంలో సక్సెస్ కావడం చర్చనీయాంశంగా మారింది.

విభజన సమయంలో వీర సమైఖ్యవాది అయిన విశాఖకు చెందిన జేటీ రామారావు తాజాగా కేసీఆర్ గూటికి చేరారు. అప్పట్లోజేటీ రామారావు సమైఖ్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. సమైఖ్య వాదాన్ని బలంగా వినిపించారు. అటువంటి నాయకుడు అనూహ్యంగా రాజకీయాల్లో యాక్టివ్ అవ్వదలచుకున్నారు. ఇప్పటికే ఏపీలో ఉన్న రాజకీయ పక్షాలు కాదని.. గతంలో ఏపీని ద్వేషించిన కేసీఆర్ ఏర్పరచిన బీఆర్ఎస్ వైపు అడుగులేశారు. తమను కాదని స్వరాష్ట్రం సాధించుకున్న కేసీఆర్ పై నమ్మకంతో ఆ పార్టీలో చేరారు. ఖమ్మం సభ సక్సెస్ కావాలని ఏకంగా విశాఖలో పూజలు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ సక్సెస్ తోనే ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం వంటి వాటిలో లాభాలు ఉన్నాయని జేటీ రామారావు చెబుతున్నారు. మొత్తానికైతే నాడు ధ్వేషించిన పార్టీ గూటికి వీర సమైఖ్యవాదులు చేరడం దేనికి సంకేతం. కేసీఆర్ మేనియా ఏపీలో బాగా వర్కవుట్ అయినట్టు కనిపిస్తోంది.